దేశంలో అమలవుతున్న కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంటులా మారిపోయిందన్నారు. ఒకసారి బోగీలోకి ప్రవేశించిన వారు ఇతరులు ప్రవేశించడానికి ఇష్టపడటం లేదన్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ) రిజర్వేషన్లకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా జిస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, జస్టిస్ సూర్యకాంత్ ఈ యేడాది ఆఖరులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
దేశంలో రిజర్వేషన్లు ఒక రైలు బోగీలా తయారైందన్నారు. రైలు కంపార్టుమెంటులోకి ఒకసారి అడుగుపెట్టిన వారు ఇతరులు రావడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. కాగా, మహారాష్ట్రలో సంస్థాగత ఎన్నికలు చివరిసారిగా 2016-17లో జరిగాయి. ఓబీసీ కోటాకు సంబంధించి న్యాయపోరాటం కారణంగానే ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
2021లో ఓబీసీలకు 27 శాతం కోటా అమలు చేస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్థానిక సంస్థల్లో వెనుకుబాటుతనంపై ఖచ్చితమైన గణాంకాల సేకరణ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు, కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్లు శాతం నిర్ధారణ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదనే త్రివిధ సూత్రాన్ని అత్యున్నత న్యాయస్థానం నిర్ధేశించింది. అప్పటి నుంచి గణాంకాల సేకరణ, సంబంధిత వ్యాజ్యాల వల్ల ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.