దేశంలో రాజకీయాలు హోటల్ మెట్లు ఎక్కుతున్నాయి. ఖరీదైన రిసార్టులు, నక్షత్రాల హోటళ్లు వీటికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. రాష్ట్రాల్లో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇవే సురక్షిత ప్రాంతాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. లేదంటే పిక్‌నిక్‌ల పేరిట ఎమ్మెల్యేలను వివిధ చోట్లకు తిప్పుతున్నాయి.
ప్రత్యర్థి పక్షం గాలానికి దొరక్కుండా చూసుకోవడం దీని ముఖ్యోద్దేశం. వివిధ రాష్ట్రాల్లో బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సివచ్చినప్పుడు.. బల నిరూపణ, విశ్వాస పరీక్షల్లో నెగ్గడం వంటి సందర్భాల్లో తరచూ హోటళ్లే రాజకీయాలకు కేంద్ర బిందువులవుతున్నాయి. ఒకరకంగా బల ప్రదర్శనలకూ ఇవే వేదికలవుతున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు తాజా ఉదాహరణ.
కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా.. తన వర్గానికి చెందిన 22 ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఓ ఖరీదైన రిసార్టుకు తరలించారు. సందర్భాన్ని చూసి వారితో రాజీనామా చేయించారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ అధికార పగ్గాల్ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉండటం వల్ల కాంగ్రెస్ జాగ్రత్త పడింది. పార్టీకి చెందిన 95 మంది ఎమ్మెల్యేలను జైపుర్‌లోని ఓ హోటల్‌కు తరలించింది.