హైదరాబాద్ యూనివర్శిటీ పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల 2016 జనవరిలో క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన ఉత్తరాన్ని చదివినప్పుడు తాను బోరున ఏడ్చేశానని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు వరుణ్ గాంధీ పేర్కొన్నారు. తాను అలాంటి పుటక పుట్టడం ద్వారా పాపం చేశానని రోహిత్ ఆ ఉత్తరంలో రాసిన లైన్ చదివి ఎంతో కుమిలిపోయానని వరుణ్ చెప్పారు.
టికామ్‌ఘర్‌లోని ఒక పాఠశాలలో 70 శాతం మంది పిల్లలు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాలలో చేసిన ఆహారాన్ని తీసుకోలేదని, దీనికి కారణం బలహీన వర్గాలకు చెందిన మహిళ వంట వండటమేనని వరుణ్ గాంధీ పేర్కొన్నారు. స్కూల్లో పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం. మన దేశం, ఈ ప్రపంచం ఎటువైపు పోతోంది అని వరుణ్ గాంధీ ప్రశ్నించారు.
రాజ్యాంగం కుల, మత ప్రాతిపదికన ఎలాంటి వివక్షను పాటించనప్పటికీ ఈ దేశంలోని 37 శాతం మంది దళితులు ఇప్పటికీ దారిద్ర్య రేఖకు దిగువనే ఉంటున్నారని చెప్పారు. 8 శాతం దళిత పిల్లలు ఈ దేశంలో తమ తొలి పుట్టిన రోజును జరుపుకోలేకున్నారని వరుణ్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ అంబేడ్కర్ మనకు కావలిసింది రాజకీయ ప్రజాస్వామ్యం కాదని సామాజిక ప్రజాస్వామం కావాలని ఏనాడో చెప్పారని, ఆయన ఆలోచనలు కాలానికి ఎంతో ముందున్నప్పటికీ అవి ఇంతవరకు పూర్తిగా అమలు కాకపోవడం విషాదమని బీజేపీ ఎంపీ అన్నారు.