మాస్కు ధరించకపోతే 10 వేలు జరిమానా.. రెండేళ్ల జైలు శిక్ష!
సోమవారం, 6 జులై 2020 (09:50 IST)
కరోనా వైరస్ నియంత్రణకు కేరళ రాష్ర్ట ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఏమాత్రం తమ నిబంధనలు అతిక్రమించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఆ మేరకు నిబంధనల్ని జారీ చేసింది. ఆవేమంటే..?
గుంపులు గుంపులుగా ఉండ కూడదు. రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కు ధరించాలని ఆదేశించింది.
ఒక వేళ మాస్కు ధరించకపోతే రూ. 10 వేలు జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ నిబంధనలు ఏడాది కాలం పాటు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది కేరళ ప్రభుత్వం.
ప్రతి వ్యక్తి తమ నోరు, ముక్కును కవర్ చేసేలా మాస్కు ధరించాలి. ఈ నిబంధనను రద్దీ ప్రాంతాలతో పాటు తాము పని చేసే ప్రాంతాల్లో కచ్చితంగా పాటించాలని చెప్పింది.
ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి మధ్య కనీసం ఆరు ఫీట్ల దూరం తప్పనిసరిగా పాటించాలి. రద్దీ ప్రాంతాలతో పాటు రోడ్లు, ఫుట్ పాత్ లపై ఉమ్మివేయడాన్ని నిషేధించారు.
ఈ నిబంధనలు పాటించని యెడల కఠిన చర్యలకు వెనుకాడమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. పెళ్లిళ్లకు 50 మంది మించి హాజరు కాకూడదు.
ప్రతి వివాహ వేదిక వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలి. పెళ్లికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. అంత్యక్రియలకు కూడా 20 మందికి మించి హాజరు కావొద్దు అని ప్రభుత్వం పేర్కొంది.