ఆ ఉద్యోగి వేతనం రూ.15 వేలు.. ఇంట్లో రూ.25 కోట్ల నగదు స్వాధీనం

ఠాగూర్

సోమవారం, 6 మే 2024 (17:55 IST)
లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఓ సాధారణ ఉద్యోగి నివాసంలో నోట్ల కట్టలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటికే లెక్కలో చూపని రూ.25 కోట్లను ఓ హౌస్‌ కీపర్‌ ఇంటి నుంచి స్వాధీనం చేసుకొన్నారు. సదరు వ్యక్తికి ఆ రాష్ట్ర మంత్రి అలంఘీర్‌ ఆలంతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి మంత్రి కార్యదర్శి సంజీవ్‌లాల్‌ వద్ద పనిచేస్తున్నట్లు తేలింది. దీంతో ఇప్పుడు ఈ అలంఘీర్‌ ఎవరు అనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 
 
తాజాగా రూ.25 కోట్లు బయటపడిన ఇల్లు సంజీవ్‌లాల్‌ సహాయకుడు జహంగీర్‌దిగా తేలింది. అతడి జీతం రూ.15 వేలు మాత్రమే. ఇక అతడి ఇంట్లో కోట్ల కొద్ది నగదు గుట్టలు బయటపడటంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. వీటిని లెక్కించేందుకు బ్యాంకుల నుంచి యంత్రాలను తెప్పించారు. దీంతోపాటు కొంత బంగారం కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. సంజీవ్‌కుమార్‌ గతంలో 10 మంది మంత్రులకు పీఏగా పనిచేశారు. 
 
1954లో పుట్టిన అలంఘీర్‌ 1974లో భాగల్పూర్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు. రాష్ట్రంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు. పకూర్‌ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు  ఎమ్మెల్యేగా గెలిచారు. సాహెబ్‌ గంజ్‌ జిల్లాలో నివాసం ఉండే అలంఘీర్‌ 2006లో రాష్ట్ర స్పీకర్‌గా కూడా పనిచేశారు. 2009లో ఓటమి పాలైన అతడు 2014, 2019లో విజయం సాధించారు. 
 
ప్రస్తుతం అలంఘీర్‌ వయస్సు 70 ఏళ్లు. చంపాయ్‌ సోరెన్‌ మంత్రివర్గంలో గ్రామీణ మంత్రిత్వశాఖను నిర్వహిస్తున్నారు. 2023లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాచీ చీఫ్‌ ఇంజినీర్‌ వీరేంద్ర కుమార్‌ రామ్‌ పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు నిర్వహించింది. ఈ కేసు తర్వాత అలంఘీర్‌ కూడా ఈడీ రాడార్‌లోకి వచ్చారు. వీరేంద్ర కుమార్‌ కాంట్రాక్టర్ల వద్ద కమిషన్‌ పేరిట భారీగా దండుకొన్నట్లు తెలిసింది. వీరికి టెండర్లను ఆశ చూపి ఈ వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు