తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంకే.స్టాలిన్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం సచివాలయానికి వెళ్లి సీఎం బాధ్యతలను స్వీకరించారు. ఇందులోభాగంగా, ఆయన తొలిసారి ఐదు ఫైళ్ళపై సంతకాలు చేశారు. వాటిలో ఒకటి మహిళలకు సిటీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తూ తయారు చేసిన ఫైలుపై సంతకం చేశారు.
ఆ తర్వాత ఎన్నికల హామీలో భాగంగా, కరోనా సాయం కింద అర్హులైన లబ్దిదారులకు ఇవ్వనున్న రూ.4 వేల ఆర్థిక సాయం ఫైలుపై సంతకం చేశారు. ఈ మొత్తంలో తొలుత రూ.2 వేలను తక్షణం 2.1 కోట్ల రేషన్ కార్డు దారులకు జమచేయనున్నారు.
అలాగే, మీ నియోజకవర్గంల స్టాలిన్ పేరుతో నిర్వహించిన ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. అంటే, ప్రజా సమస్యల ఫిర్యాదులపై వంద రోజుల్లో పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోనున్నారు.
అంతకుముందు.. ఆయన రాజ్‌భవన్‌లో తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఆయన చేత ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన తన తండ్రి కరుణానిధి స్మృతి వనం దగ్గరికి వెళ్లి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా సెక్రెటేరియట్‌కు వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.