శబరిమల తీర్పుపై రివ్యూ పిటిషన్లు.. స్వీకరించిన సుప్రీం.. నవంబర్ 13న విచారణ

మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:26 IST)
పదేళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తూ.. అక్టోబర్‌లో సుప్రీం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు వివాదాస్పదమైంది. సుప్రీం కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు అయ్యప్ప భక్తులు. ఈ మేరకు మహిళలను అయ్యప్ప గుడిలోకి అనుమతించవద్దని దాఖలైన రివ్యూ పిటిషన్లను వచ్చేనెలలో సుప్రీంకోర్టు ముందుకు రానున్నాయి. 
 
ఈ పిటిషన్లను అక్టోబర్ 23 (మంగళవారం) స్వీకరించిన కోర్టు.. నవంబరు 13న విచారణ జరుపనున్నట్లు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌తో కూడిన ధర్మాసనం ఈ రివ్యూ పిటిషన్లపై సానుకూలంగా స్పందించింది.
 
శబరిమల ఆలయంలోకి అన్ని వయసు మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజార్టీతో తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడినప్పటి నుంచి శబరిమలలో ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. అయ్యప్ప భక్తులు.. హిందూత్వవాదులు తీర్పును సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయ పవిత్రతను కాపాడాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించగా భక్తులు అడ్డుకున్నారు. ఉద్రిక్తతల నడుమే సోమవారం రాత్రి ఆలయ ద్వారాలను మూసేశారు.  
 
అలాగే శబరిమలలో ఉద్రిక్తతలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును అమలుపరిచేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. ప్రభుత్వం, పోలీసులు మహిళలను అడ్డుకోలేదని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వల్లే శబరిమల వార్ జోన్‌గా మారిందన్నారు. ఎన్నడూ లేని రీతిలో కొందరు ఆందోళనకారులు మహిళా భక్తులు, మీడియాపైనా దాడి చేశారని పినరయి విజయన్ తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. కేరళలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం వివాదాస్పదమైన వేళ ఓ చిన్నారి సందేశంతో ముందుకొచ్చింది. సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. తొమ్మిదేళ్ల చిన్నారి శబరిమల గుడిలో ప్రత్యేకంగా కనిపించింది. ఆమె చేతిలో ఓ ఎల్లోకలర్ ప్లకార్డ్ అంది. తాను తొమ్మిదేళ్ల వయస్సులో శబరిమల గుడికి వచ్చానని... తన వయసు 50 ఏళ్లు దాటినప్పుడు తిరిగి శబరిమలకు వస్తానని.. అప్పటిదాకా ఎదురుచూస్తుంటానంటూ ఆ ఫ్లకార్డ్‌లో వుంది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు