శశికళకు పన్నీర్ సెల్వం ఎలా చెక్ పెడుతున్నారు? పక్కా పొలిటికల్ లీడర్‌గా ఎలా మారాడు?

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (16:34 IST)
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ. పన్నీర్ సెల్వం మంగళవారం రాత్రి నుంచి చుక్కలు చూపిస్తున్నారు. సౌమ్యుడు, మృదుస్వభావిగా, అత్యంత విశ్వాసపాత్రుడు, వీరవిధేయుడిగా పేరొందిన పన్నీర్ సెల్వం.. ఇపుడు అచ్చు పొలిటికల్ లీడర్‌గా మారిపోయారు. దీనికి కారణం ఏమిటో పరిశీలిద్ధాం. 
 
ముఖ్యమంత్రి పదవికి శశికళ ఆదేశంతో రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన ప్లేటు ఫిరాయించారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మంగళవారం రాత్రి ప్రకటించి సంచలన ప్రకటన చేశారు. అదేసమయంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ ఆదేశించారు. ఇదే పన్నీర్‌కు కలిసి వచ్చింది. 
 
ఇప్పటికే శశికళకు చెక్ చెప్పాలని అనుకున్న ఆయన, సాధ్యమైనంత త్వరగా ఆ పని చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పన్నీర్ దూకుడు పెంచిన వేళ, ఏం చేయాలో పాలుపోని స్థితిలో శశికళ వర్గం ఉన్నట్టు తమిళనాడు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తనకున్న హోదాతో జయలలిత మృతిపై విచారణ జరిపిస్తానని, ఆమె నివాసాన్ని మెమోరియల్ హాలుగా మారుస్తానని చెప్పి ఈ ఉదయం శశికళ వర్గానికి షాకిచ్చిన ఆయన, ఆపై శరవేగంగా పావులు కదిపారు.
 
డీజీపీ, సీఎస్‌లతో సమావేశమై రహస్యంగా శశికళ దాచివుంచిన ఎమ్మెల్యేలను తక్షణం బయటకు తేవాలని ఆదేశాలివ్వడం కూడా ఆయన ఎత్తులో భాగమే. ఆపై బుధవారం నుంచి క్యాంపు రాజకీయాల్లో భాగమైన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా బయటకు వస్తుంటే ఆయన శిబిరం ఆనందంలో మునిగిపోతోంది. 

వెబ్దునియా పై చదవండి