అక్రమాస్తుల కేసులో చిప్పకూడు తింటున్న చిన్నమ్మ శశికళ ఈమధ్య భర్తకు బాగోలేదని పెరోల్‌పై బయటికి వచ్చింది. జైలులో వుంటూ రాజభోగాలు అనుభవించిందని ఆ మధ్య సీసీటీవీ కెమెరాల ద్వారా, సీనియర్ అధికారుల రైడ్‌లో చిన్నమ్మ బాగోతం బయటపడింది. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పెరోల్‌పై అనారోగ్యంతో బాధపడుతున్న భర్త నటరాజన్ ను చూసేందుకు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా శశికళ మాస్టర్ మైండ్‌కు పనిచెప్పింది. ఎలాగో బయటికి వచ్చేశాం కదాని వ్యక్తిగత పనులను చక్కబెట్టుకుంది. ఈ క్రమంలో 622 ఆస్తులను ఇతరుల పేర బదిలీ చేయించింది. ఆమె కదలికలపై పూర్తి స్థాయి నిఘా ఉంచిన అధికారులు, ఆమె ప్రతి అడుగును క్షుణ్ణంగా పరిశీలించారు. అందుకే చిన్నమ్మ పెరోల్ ముగిసి జైలుకెళ్లాక శశికళ నివాసం, కార్యాలయాలు, సన్నిహితులు, బంధువులు, లాయర్లు తదితరులపై ఐటీ దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 1400 కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్టు గుర్తించగా, సుమారు 30,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఆమె ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న పరప్పణ అగ్రహార జైలు సూపరింటెండెంట్‌కు లేఖ పంపి విచారణకు అనుమతి పొందనున్నారని సమాచారం. అదన్నమాట.. చిన్నమ్మ వల్లే వారి కుటుంబీకులు, బంధువుల ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.