కోవిషీల్డ్ ధరను తగ్గించిన సీరమ్ ఇనిస్టిట్యూట్

బుధవారం, 28 ఏప్రియల్ 2021 (19:18 IST)
దేశంలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చింది. ఫలితంగా మూడున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవలి వరకు వ్యాక్సిన్లపై విముఖత కనబర్చిన ప్రజలు ఇపుడు వ్యాక్సిన్ కేంద్రాలకు క్యూకడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో, కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు సీరం ఇనిస్టిట్యూట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వ్యాక్సిన్ ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రాలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రూ.300కే ఇవ్వాలని నిర్ణయించింది. 
 
గతంలో ఈ ధర రూ.400 కాగా, ఇపుడు రూ.100 తగ్గించి విక్రయించనున్నట్టు సీరం వెల్లడించింది. తగ్గింపు ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీనిపై సీరం సంస్థ అధినేత అదర్ పూనావాలా ట్విట్టర్‌లో ఓ ప్రకటన చేశారు.
 
ఇకపోతే, కొవిషీల్డ్ టీకాను బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భారత్‌లో క్లినికల్ పరీక్షల అనంతరం కొవిషీల్డ్‌కు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేశారు.
 
భారత్‌లో అమలు చేస్తున్న కరోనా వ్యాక్సినేషన్‌లో కొవాగ్జిన్ (భారత్ బయోటెక్)తో పాటు కొవిషీల్డ్‌ను కూడా ఇస్తున్నారు. అలాగే, మే ఒకటో తేదీ నుంచి రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారత్‌లో అందుబాటులోకి రానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు