మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. భోపాల్ నుంచి ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో విరిగిపోయిన సీటులో కూర్చొని గంటన్నర పాటు ప్రయాణం చేశారు. దీనిపై మంత్రి చౌహాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రయాణికులను మోసం చేయడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఎయిరిండియా నిర్వహణను టాటా గ్రూపు తీసుకున్న తర్వాత ఎయిర్‌లైన్స్ సేవలు మెరుగుపడతాయని అనుకున్నానని, కానీ అది తన అపోహేనని అర్థమైందని మంత్రి వ్యాఖ్యానించారు.
ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ప్రశ్నించగా, ఈ సమస్యను యాజమాన్యం ఆలస్యంగా గుర్తించిందని, ఈ సీటు టికెట్‌ను ప్రయాణికులకు విక్రయించకూడదని ఆదేశించిందని తెలిపారు. విమానంలో అదొక్కటే కాకుండా మరిన్ని సీట్లు కూడా సరిగ్గా లేవని సిబ్బంది చెప్పారని కేంద్రమంత్రి చౌహాన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తోటి ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోమని ఆఫర్ చేశారన్నారు. కానీ, వారికి ఇబ్బంది కలగించడం ఇష్టం లేక అదే విరిగిపోయిన సీటులోనే గంటన్నరపాటు కూర్చొని ప్రయాణించారని తెలిపారు.