గుళ్లు, మసీదులకు ప్రజలను లౌడ్ స్పీకర్ల ద్వారా నిద్రలేపే డ్యూటీ వేశారా: సోనూ నిగమ్ ప్రశ్న

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (05:51 IST)
తెల్లవారు జామున గాఢనిద్రలో ఉంటాం. ఉన్నట్లుండి లౌడ్ స్పీకర్ మోగుతుంది. ఒకరు అల్లా అంటారు. మరొకరు జై శ్రీరామ్ అంటారు. చెవులకు ఉన్న తుప్పు వదిలేదాకా, నిద్రమత్తు పారిపోయేదాకా ఆధ్యాత్మిక రోదను వినిపించి వినిపించి ఆపై సైలెంట్ అవుతాయి. ఆ అయిదు నిమిషాల శబ్దకాలుష్యం ఇక మనుషులను నిద్రపోనివ్వదు. రాత్రి డ్యూటీలు చేసివచ్చి అప్పుడే పడుకునే వారి పరిస్థితి ఇక నరకమే. ఇలాంటి బాధలను ఎవరు బయటకు వ్యక్తపరుస్తారు? నిద్రలేపక ముందే లౌడ్ స్పీకర్లతో మెదళ్లను వాయగొట్టే స్వేచ్చ మతాలకు ఉంటే కాస్త ప్రశాంతంగా నిద్రపోయే స్వేచ్ఛ ఈ దేశ ప్రజలకు ఉండదా?

 
 
సగటు మనిషి ఇలాంటి శబ్ద కాలుష్యాలపై అప్పటికప్పుడు విసుక్కుని తన పనిలో తాను ఉంటాడు కానీ ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనీనిగమ్‌కు పిచ్చెత్తిపోయినట్లుంది. లౌడ్‌ స్పీకర్ల ద్వారా మసీదులు, గుళ్లు, హరిద్వారాలు చేసే ఉపన్యాసాలు, ప్రార్థన పిలుపులను ‘గూండాగిరీ’గా అభివర్ణించారు. సోమవారం ఈ మేరకు వరుసగా ట్వీట్లు చేశారు. ‘గుళ్లు, మసీదులు.. ప్రజలను లౌడ్‌స్పీకర్ల ద్వారా ఎందుకు నిద్ర లేపుతున్నాయో నాకు అర్థం కావడం లేదు. బలవంతపు మతతత్వాన్ని ప్రజలపై రుద్దడాన్ని ఆపేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 
 
‘దేవుడు అందరినీ ఆశీర్వదించాలి. నేను ముస్లింను కాను. కానీ ప్రతి రోజూ తెల్లవారుజామునే అజాన్‌తో నిద్ర లేస్తున్నాను. దేశంలో ఈ బలవంతపు మతతత్వం ఎప్పుడూ అంతమవుతుందో..’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. నిద్రాభంగానికి దారితీస్తున్న ఆధ్యాత్మిక లౌడ్ స్పీకర్లను అదుపు చేయడం సాధ్యమవుతుందో లేదో కానీ బలవంతపు మతతత్వాన్ని ప్రజలపై రుద్దడాన్ని సోనూ నిగమ్ ప్రశ్నించి వివాదాన్ని, సంచలనాన్ని రేకెత్తించినా తను వేసిన ప్రశ్నకు మాత్రం దేశంలోని మతాలు, వాటి అవలంబికులు సమాధానం ఇవ్వాల్సిందేనని కొందరి ప్రశ్న.
 

వెబ్దునియా పై చదవండి