రాజకీయాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ స్పందించారు. తనను మిత్రుడిగా భావించినందుకు రజనీకాంత్‌కు స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ.. స్టాలిన్ హెచ్చరించారు. తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ చూస్తోందని అందుకే ముందుగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు.
కాగా అభిమానులను నాలుగు రోజుల పాటు కలిసిన రజనీకాంత్.. రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలిస్తూ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో భాగంగా డీఎంకే నేత, కరుణానిధి కుమారుడు స్టాలిన్‌పై ప్రశంసల జల్లు కురపించారు. స్టాలిన్‌లో తనకో నేత కనిపిస్తాడని, ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే, అవి మరింత ఫలవంతమవుతాయని కితాబిచ్చారు.
శుక్రవారం తన అభిమానులను కలుసుకున్న సందర్భంగా ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ అద్వానంగా తయారైందంటూ స్వరం పెంచి మాట్లాడారు. రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమిళనాడులో మంచి నాయకులున్నా వ్యవస్థలో మార్పురాలేదని వెల్లడించారు. తమిళ రాజకీయాల్లో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు.
రాజకీయ పరంగా సామర్థ్యం కలిగిన వ్యక్తి స్టాలిన్, ప్రపంచవ్యాప్తంగా పర్యటించిన ఒక శక్తివంతమైన నిర్వాహకుడు అన్బుమణి రామదాస్ అని, తిరుమావళవన్ ప్రతీ విషయంపైనా క్లుప్తంగా మాట్లాడగల వ్యక్తి అంటూ రజనీ ప్రశంసించారు. ముఖ్యంగా స్టాలిన్‌ను స్నేహితుడంటూ పేర్కొన్నారు.