ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

ఠాగూర్

మంగళవారం, 22 జులై 2025 (15:05 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్ ఐఐటీలో విద్యార్థులు అనుమానాస్పదంగా చనిపోతున్నారు. గత నాలుగు రోజుల్లో రెండు మరణాలు సంభవించాయి. సోమవారం రాత్రి ఓ విద్యార్థి చనిపోయాడు. ద్వితీయ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేస్తున్న చంద్రదీప్ పవార్ ఐఐటీ క్యాంపస్‌లో అనుమానాస్పదంగా చనిపోయాడు. కాగా, ఈ నెల 18వ తేదీన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి రితం మండల్ మృతదేహం హాస్టల్ గదిలో అనుమానాస్పదస్థితిలో కనిపించిన విషయం తెల్సిందే.
 
కాగా, సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత చంద్రదీప్ వైద్యుడి సలహా మేరకు ఏదో మెడిసిన్ వాడినట్టు పోలీసులకు విద్యాసంస్థ అధికారులు సమాచారం చేరవేశారు. ఆ విద్యార్థి తీసుకున్న టాబ్లెట్ శ్వాసనాళంలో ఇరుక్కుపోయి చివరికి అతని మరణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్రదీప్‌ను తొలుత ఐఐటీ క్యాంపస్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడి వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్టు ప్రకటించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. అతని మరణానికి అసలు కారణం శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈ మృతిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు