వారంరోజుల ప్రయోగం కోసం అంతరిక్ష పరిశోధనా కేంద్రా(ఐఎస్ఎస్)నికి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అనివార్య కారణాలతో అక్కడే తొమ్మిది నెలల పాటు ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీతా విలియమ్స్‌తో సహా ఇతర వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన స్టార్ క్యాప్సూల్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఆమె భూమికి చేరుకున్నారు.
అయితే, అంతరిక్షంలో సుధీర్ఘకాలం ఉండి భూమికి చేరుకున్న సునీతా విలియమ్స్ భూవాతావరణానికి అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. కాబట్టి శరీరం తేలికగా మారుతుంది. సునీత అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వల్ల ఆమె ఎముకలు పెళుసుబారి, కండరాలు క్షీణించివుంటాయి.