పౌరసత్వం హక్కు కాదు.. అదో బాధ్యత : చీఫ్ జస్టీస్ బాబ్డే

ఆదివారం, 19 జనవరి 2020 (15:12 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు సాగుతున్నాయి. పలు రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయమని తీర్మానాలు చేశాయి. కేరళ రాష్ట్రం సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
రాష్ట్రసంత్ తుకాడోజి మహరాజ్ నాగపూర్ యూనివర్శిటీ 107వ స్నాతకోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పౌరసత్వం అంటే కేవలం హక్కు మాత్రమే కాదని, సమాజం పట్ల పౌరులకు ఉన్న బాధ్యత కూడా అని చెప్పారు. బాధ్యత గల పౌరులుగా ఉండాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపై ఉందని అన్నారు. 
 
న్యాయాన్ని పరిరక్షించడం ఒక పవిత్రమైన కార్యమని జస్టిస్ బాబ్డే ఈ సందర్బంగా అన్నారు. న్యాయాన్ని పొందడం అనేది దేశంలోని ప్రతి వ్యక్తికి సహజసిద్ధంగా లభించిన హక్కు అని చెప్పారు. న్యాయం విషయంలో సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి వ్యక్తుల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయని అన్నారు. 
 
ఈరోజు న్యాయం అనిపించినది రేపు అన్యాయంగా అనిపించవచ్చని చెప్పారు. న్యాయంతో పాటు హక్కులు, బాధ్యతలు కూడా అంతే సమానమైనవని అన్నారు. మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించకపోతే.. సమాజం సమతుల్యతను కోల్పోతుందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు