భారత ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు

బుధవారం, 23 నవంబరు 2022 (22:14 IST)
భారత ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్‌ను కేంద్రం నియమించింది. ఈ నియామకం హడావువుడిగా, ఆగమేఘాలపై జరిగింది. నిజానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అరుణ్ గోయల్ ఉన్నట్టు తన పదవికి స్వచ్చంధ విరమణ చేశారు. ఆ తర్వాత ఆయన్ను కేంద్ర ప్రభుత్వం భారత ఎన్నికల సంఘం 19వ కమిషనరుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, ఆయన బాధ్యతలు స్వీకరించడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. 
 
అయితే, ఈ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు సునిశిత కామెంట్స్ చేస్తూ కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. ఈ నెల 19వ తేదీన ఎలక్షన్ కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన పూర్తి ఫైలును తమకు గురువారం లోగా తమకు సమర్పించాలని కేంద్రాన్ని జస్టిస్ జోసెఫ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది. ఆయన నియామకంలో ఏదేని మతలబు (నిబంధనల ఉల్లంఘన) జరిగిందా అనే విషయాన్ని తాము తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు ధర్మాసనం పేర్కొంది. 
 
ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా అరుణ్ గోయల్ నియామకాన్ని సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించారు. అరుణ్ గోయల్ తాజాగా వీఆర్ఎస్ తీసుకున్నారని, ఆ మరుక్షణమే ఆయన్ను కేంద్రం భారత ఎన్నికల కమిషనరుగా నియమించిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. నిజానికి ఆయన 60 యేళ్ల వయస్సులో డిసెంబరు 31వ తేదీన రిటైర్డ్ కావాల్సి వుందన్నారు. దీనికి అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదిస్తూ ఈ నియామకాన్ని వ్యక్తిగతంగా చూడరాదన్నారు. 
 
అయితే, ఆయన వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని కోర్టు తోసిపుచ్చి... ఈ విషయాన్ని తాము ప్రతికూల దృష్టితో చూడటం లేదని, అంతా సవ్యంగా ఉందని మీరు చెబుతున్నప్పటికీ మాకు రికార్డులు కావాలని, రేపటి వరకు మీకు వ్యవధి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు