నిత్యం ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే రాజకీయ నేతల్లో ఆజం ఖాన్ ఒకరు. ఈయన తాజాగా చేసిన వ్యాఖ్యలు దేశంలో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ కఠిన నిర్ణయం తీసుకుని తాజ్‌మహాల్‌ను కూల్చి వేయాలని కోరారు. అపుడు నిర్మొహమాటంగా బీజేపీకి మద్దతు ఇస్తానని ప్రకటించారు.
అంతేకాకుండా, తాజ్‌ను కూలగొట్టాలన్న అంశాన్ని తాను దశాబ్దాల క్రితమే లేవనెత్తినట్టు చెప్పిన ఆయన, తాజ్‌తో పాటు ఢిల్లీలోని ఎర్రకోట, పార్లమెంట్, కుతుబ్‌మినార్ వంటివి బానిసత్వానికి ప్రతీకలని, వాటన్నింటినీ కూల్చాలని డిమాండ్ చేశారు.
యూపీ టూరిజం మంత్రి రీటా బహుగుణ ఆధ్వర్యంలో తయారు చేసిన 32 పేజీల పర్యాటక బ్రోచర్‌లో తాజ్ ప్రస్తావన లేకపోవడం కలకలం రేపగా, ఆజం ఖాన్ స్పందించారు. వారణాసిలో గంగా హారతి ముఖ చిత్రంతో, కవర్ పేజీపై ఆదిత్యనాథ్, బహుగుణ చిత్రాలతో తయారైన 32 పేజీల పుస్తకాన్ని పలువురు విమర్శించిన సంగతి తెలిసిందే.