'చిన్నమ్మ' శశికళతో 'తల' అజిత్ భేటీ: మద్దతు కోసమా? పార్టీ పగ్గాలు తీసుకోమని చెప్పడానికా?

మంగళవారం, 27 డిశెంబరు 2016 (20:44 IST)
తమిళనాట జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయాలతోపాటు ఐటీ దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. సంచలనం సృష్టిస్తూ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ రావుపై ఐటీ దాడులు జరిగాయి. ఇదిలావుంటే అమ్మ జయలలిత ముఖ్యమంత్రి పీఠాన్ని పన్నీర్ సెల్వం అధిష్టించగా పార్టీ పగ్గాల అప్పగింతలో మాత్రం సస్పెన్స్ సాగుతోంది. ఈ నెల 29న చిన్నమ్మ శశికళకు పార్టీ పగ్గాలను అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. 
 
ఈ ప్రచారం ఇలా జరుగుతూ ఉండగానే తమిళనాడు సినీ ఇండస్ట్రీ తల అని పిలుచుకునే నటుడు అజిత్ మంగళవారం నాడు చిన్నమ్మ శశికళతో పోయెస్ గార్డెన్ లో భేటీ అయినట్లు సమాచారం. అజిత్ భేటీ అయినట్లు అన్నాడీఎంకే పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ఐతే అజిత్, శశికళ మధ్య భేటీ సారాంశం ఏమిటన్నది తెలియరాలేదు. 
 
ఐతే శశికళపై వస్తున్న వ్యతిరేకత నేపధ్యంలో అజిత్ మద్దతు కోసం శశికళ ఈ భేటీ ఏర్పాటు చేశారని కొందరు అనుకుంటున్నారు. మరికొందరు... అజిత్ ను జయలలిత తన కుమారుడిలా చూసుకునేవారనీ, అందువల్ల పార్టీ పగ్గాలను ఆయనకు అప్పగించేందుకే శశికళ ఆయనను పిలిపించి ఉంటారని అనుకుంటున్నారు. ఐతే ఈ విషయంపై అజిత్ మాత్రం నోరు విప్పడంలేదు.

వెబ్దునియా పై చదవండి