ఇంటికో ఉద్యోగం... వాషింగ్‌మెషీన్ ఫ్రీ... ఉచిత ఇల్లు... అన్నాడీఎంకే వరాల జల్లు

ఆదివారం, 14 మార్చి 2021 (23:40 IST)
తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే తన మేనిఫెస్టోను ప్రకటించింది. ఇందులో కరోనా సాయంగా రూ.4 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలాగే, కుటుంబ యజమానురాలికి నెలకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. వీటితో పాటు.. పలు వరాల జల్లులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం అధికార అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదలైంది. ఇందులో అనేక వరాలు కురిపించారు. 
 
ముఖ్యంగా, ఇళ్లు లేని వారందిరికీ ఉచిత గృహాలు, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆదివారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో సంయుక్తంగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అమ్మ హౌసింగ్ స్కీమ్‌ ద్వారా ప్రస్తుతం ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో భరోసా ఇచ్చారు. 
 
గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను గుర్తించి, ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లోనే రెసిడెన్షియల్ ఆపార్ట్‌మెంట్లు నిర్మించి ఇస్తామని మేనిఫెస్టో తెలిపింది. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా వాషింగ్ మిషన్లు, సోలార్ స్టవ్‌లు ఇస్తామని, ప్రతి ఇంటికి ఉచితంగా కేబుల్ టీవీ సదుపాయం కల్పిస్తామని  పేర్కొంది.
 
కాగా, అన్నాడీఎంకే ఇప్పటికే రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని, విద్యార్థులకు విద్యా రుణాలు మాఫీ చేస్తామని, ఏడాదంతా విద్యార్థులకు 2జీబీ ఉచిత డాటా అందిస్తామని హామీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని భరోసా ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా అన్నాడీఎంకే పలు హామీలు ఇచ్చింది. 
 
గృహిణిలకు ప్రతి నెలా 1,500 రూపాయలు ఇవ్వడంతో పాటు, ఏటా 6 ఎల్‌పీజీ డొమెస్టిక్ సిలెండర్లు ఉచితంగా ఇచ్చేందుకు యోచన చేస్తున్నామని ప్రకటించింది. టౌన్ బస్సులలో ప్రయాణించే మహిళలకు టిక్కెట్ రేటులో 50 శాతం రాయితీ ఇస్తామని పేర్కొంది. గ్రీన్ ఆటో‌రిక్షా కొనుగోలు చేసే ఆటో డ్రైవర్లకు రూ.25,000 సబ్సిడీ ఇస్తామని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు