గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతల హత్య - కేరళలో ఉద్రిక్తత

ఆదివారం, 19 డిశెంబరు 2021 (14:42 IST)
కేరళ రాష్ట్రంలోని అళప్పుళా జిల్లాలో ఇద్దరు రాజకీయ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. కేవలం 12 గంటల వ్యవధిలో వీరిద్దరినీ కొందరు దండగులు చంపేశారు. మృతుల్లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కేరళ విభాగం కార్యదర్శి కేఎస్ షాన్, బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ విభాగం కార్యదర్శి రంజిత్ శ్రీనివాస్‌లు ఉన్నారు. వీరిలో ఒకరు శనివారం రాత్రి, మరొకరు ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. 
 
కేఎస్ షాన్ శనివారం రాత్రి తన విధులు ముగించుకుని పార్టీ ఆఫీస్ నుంచి వెళుతుండగా, కారులో వచ్చిన ఇద్దరు దుండగులు ఆయన బైక్‌ను ఢీకొట్టారు. దీంతో ఆయన కిందపడిపోవడంతో ఆ తర్వాత ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఈ హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే శ్రీనివాస్ హత్యకు గురయ్యారు. షాన్ హత్యకు ప్రతీకారంగానే బీజేపీ నేతను హత్య చేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం కొందరు దుండగులు రంజిత్ ఇంట్లోకి చొరబడిమరీ హత్య చేశారు. దీంతో కేరళ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ హత్యలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు