11 యేళ్ళు ప్రియురాలిని చిన్న గదిలో దాచుకున్న ప్రియుడు, ఆ తరువాత..?

సోమవారం, 14 జూన్ 2021 (13:17 IST)
ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. ప్రియురాలికి దూరంగా ఉండడం అతనికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా తన ప్రియురాలిని ఏకాంగా 11 యేళ్ళు తన గదిలో దాచుకున్నాడు. ఆమెకు చిన్న సమస్య కూడా ఎదురవ్వకుండా ప్రేమగా చూసుకున్నాడు. 
 
పాలగర్ జిల్లాలోని ఐలూరుజిల్లాలకు చెందిన యువతీయువకులు కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్నారట. రెహమాన్ ఇంటికి సమీపంలో సజిత ఇల్లు ఉండేది. ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2010 ఫిబ్రవరి నెలలో సజితను తన ఇంటికి తీసుకొచ్చాడు.
 
ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. ఇంట్లో ఉన్న ఒక చిన్న గదిలో సజితను ఉంచాడు. ఆ గదికి ఉన్న కిటికీ గ్రిల్స్‌ను తొలగించి రహస్యంగా డోర్ ఏర్పాటు చేశాడు. ఇక గది తలుపు ఉన్న గడియకు విద్యుత్  ప్రసరించేలా ఏర్పాటు చేశాడు. దీంతో ఆ గడియను ఎవరు ముట్టుకున్నా విద్యుత్ షాక్ వస్తోందట.
 
ఇదంతా తన ప్రియురాలి ఆ గదిలో ఉండేదన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్లాన్ చేశాడట. అలా 2010 నుంచి ఈ యేడాది మార్చి వరకు ఆ గదిలోనే సజిత ఉంది. రెహమాన్ అమ్మా, నాన్నతో పాటు చెల్లి ఆ ఇంట్లో ఉన్నప్పటికీ సజిత అక్కడ ఉన్నట్లుగా మాత్రం వారికి తెలియదట.
 
అయితే సజిత అదృశ్యమైనట్ల ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రామంతో పాటు సమీప గ్రామాలను కూడా గాలించారు పోలీసులు. ఎందరినో విచారించారు. అందులో రెహమాన్ కూడా ఉన్నాడు. అయినప్పటికీ సజిత, రెహమాన్ ఇంట్లో ఉంటున్న విషయం బయటకు రాలేదు. 
 
ఇంట్లో తెలియకుండా రెహమాన్ తన ప్రియురాలిని తీసుకుని వితాండా గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నారు. ఉన్నట్లుండి రెహమాన్ అదృశ్యం కావడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి రెహమాన్ ఉన్న ప్రదేశాన్ని కనుగొన్న పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సజిత కూడా అక్కడే ఉండడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. 
 
ఇద్దరినీ పోలీసులు కోర్టులో హాజరుపరుచగా ఇద్దరూ కలిసి ఉండడానికి కోర్టు అనుమతినిచ్చింది. అయితే తన కూతురు తిరిగి రావడంతో సజిత కుటుంబ సభ్యులు ఆనందంతో ఉన్నారు. అయితే 11 యేళ్ళ పాటు ప్రియురాలిని ఎలా జాగ్రత్తగా చూసుకున్నాడన్నది ఇప్పుడు గ్రామంలో చర్చకు దారితీస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు