వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలు ఇందుకు కారణం అవుతున్నాయి. ప్రపంచంలోని సముద్రమట్టాలన్నీ ఏటికేటికి పెరుగుతున్నాయి. మన దేశం విషయానికొస్తే 26 ఏళ్లలో దాదాపు (1990 నుంచి 2016 వరకు) 6632 కి.మీ.ల తీరప్రాతం కోతకు గురైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇదే సమయంలో ఒడిశాలో దాదాపు 150 కి.మీ.ల మేరకు తీరం సముద్రంలో కలిసిపోయింది. గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక్కడ సముద్రమట్టం 35 అడుగుల నుంచి 10 అడుగులకు కుచించుకు పోయింది.
ఒడిశాలో సగటున ఏటా 5 కిలోమీటర్ల తీరం సముద్రగర్భంలో కలిసిపోతున్నది. గత రెండు దశాబ్దాల్లో బరాహపూర్, శాతభయా గ్రామాలకు చెందిన 3000 మంది సొంతూళ్లను విడిచి వెళ్లారు. ఇక వ్యవసాయ భూముల్లో క్రమంగా ఇసుక మేటలు పేరుకుంటున్నాయి.
గూగుల్ మ్యాప్‌లలో శాతభయా గ్రామం నీట మునిగిన దృశ్యాలు తరుముకొస్తున్న ముప్పును కళ్లకు కడుతుంది. ఈ అనుభవం ప్రస్తుత తీరగ్రామాల ప్రజలను మరింత ఆందోళకు గురిచేస్తోంది. వచ్చే పదేళ్లలో తమ గ్రామాలూ సముద్రగర్భంలో కలిసిపోతాయన్న బెంగపట్టుకుంది.
ఒడిశాకు మొత్తంగా 550 కి.మీ. సముద్రతీరం ఉంది. గత రెండున్నర దశాబ్దాల్లో 28శాతం ముంపునకు గురైందని చెన్నైలోని జాతీయ తీరప్రాంత పరిశోధనా కేంద్రం వెల్లడించింది. తీర ప్రాంతం పరిధిలో ఆరు జిల్లాలుండగా, వీటిలో కేంద్రపాద, జగత్‌సింగపూర్ జిల్లాలు తుపానుల వల్ల తీవ్రనష్టానికి గురయ్యాయి. రెండు జిల్లాలు వరుసగా 31 కి.మీ, 14.5 కి.మీ చొప్పున తీరప్రాంతాన్ని కోల్పోయాయి.
వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 1960లో పారాదీప్ ఓడరేవు నిర్మాణం సమయంలో ఇక్కడున్న వేలాది ఎకరాల అటవీప్రాంతాన్ని తొలగించారు. ఇదే ఇప్పుడు శాపంగా మారిందని శాతభయా గ్రామస్తులు వాపోతున్నారు. 1999 నాటి సూపర్ సైక్లోన్ ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం కలిగించిందని చెబుతున్నారు.
మిగతా సముద్రతీర రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి. పశ్చిమబెంగాల్ (63శాతం), పుదుచ్చేరి (57శాతం), కేరళ (45శాతం), తమిళనాడు (41శాతం) రాష్ట్రాల్లో తీరాలు కోతకు గురయ్యాయి. ద.ఆసియాలోని 170 కోట్ల మంది అధిక ఉష్ణోగ్రతలు, సముద్రమట్టాల పెరుగుదల పర్యవసానాల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. వీరంతా తరచూ తుపానులు, వరదల బీభత్సానికి అల్లాడిపోతున్నారు.
ఒడిశా తీరంలోని గ్రామాల తాగునీటి అవసరాలకు బోరుబావులే ప్రధాన వనరు. భూమి కోతకు గురవుతుండటం వల్ల వీటికి ముప్పు ఏర్పడింది. శాతభయాలోని చేతిపంపుల రూపంలో ఉన్న రెండు బోరుబావులు ఒకప్పుడు సముద్రమట్టానికి ఆరు మీటర్ల ఎత్తులో ఉన్నవి కాస్తా, ఇప్పుడు కేవలం ఒక మీటరు ఎత్తుకే పరిమితం అయ్యాయి.
దీంతో వీటిని కృత్రిమ ఏర్పాట్లతో ఎత్తు పెంచారు. వీటినుంచి నీటిని తోడుకోవాలంటే అల్లంత ఎత్తులో ఉన్న బోరింగ్‌ను తాడు సహాయంతో ఆడించాల్సి వస్తోంది. మరొక చేతిపంపు రెండు నెలల కిందటే ఇసుకలో పూడిపోయింది. ఒకవైపు పంటపొలాలు ఇసుక దిబ్బలుగా మారడం, ఇంకొకవైపు పశువులకు గ్రాసం అందుబాటులో లేకపోవడంతో ఇక్కడి ప్రజల మనుగడ ప్రశ్నార్దకంగా మారింది.
కోసం కేంద్రపాద ఏరియాలోని 200 మంది యువకులు బతుకుదెరువు కోసం తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వలసవెళ్లారు.
ప్రజలతోపాటు దేవుళ్లు కూడా ప్రమాదం నుంచి పారిపోవాల్సి వస్తోంది. శాతభయా పంచాయతీ పరిధిలోని పంచబురాహి అమ్మవారు కూడా వలసబాట పట్టారు. ఈ దేవాలయాన్ని 10 కిమీ దూరంలోని బాగపాటియా గ్రామానికి తరలించారు.
2008-17 మధ్య కాలంలో 571 మంది సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పటికీ 120 కుటుంబాలు సాగరుడితో పోరాటం సాగిస్తూ మొండిగా బతుకీడుస్తున్నారు.
ఈ విపత్తును అధిగమించేందుకు ఒడిశా ప్రభుత్వం తమ వంతు ప్రయత్నాలు చేపడుతోంది. యుద్ధ ప్రాతిపదికన విపత్తును ఎదుర్కొనేందుకు కసరత్తు మొదలు పెట్టింది. సాధ్యమైనంత వరకు సముద్రుడిని నిలువరించేలా ప్రణాళికలు అమలు చేస్తోంది. 600 మీటర్ల పొడవున సింథటిక్ సాగర కుడ్యాన్ని నిర్మిస్తోంది.
39 కోట్ల రూ పాయలతో కేంద్రపాద ఏరియాలోని పెంథా గ్రామం వద్ద మూడేళ్ల కిందట ఈ ప్రాజె క్టును ప్రారంభించింది. ఆటుపోట్ల తాకిడి నుంచి భూమి కోతకు గురికాకుండా ఈ ఏ ర్పాట్లు చేస్తున్నది. అదే సమయంలో సమీప ప్రాంతాల ప్రజలను ఇప్పటి నుంచే అప్రమత్తం చేస్తూ, పునరావాసం కల్పించే చర్యలు వేగవంతం చేసింది.