ఆ అలవాటు వుందని విడాకులు ఇవ్వలేం... నాగ్‌పూర్ కోర్టు

బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (18:08 IST)
భార్యకు పొగాకు నమిలే అలవాటుందన్న కారణంగా విడాకులు ఇవ్వడం సాధ్యం కాదని బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్ తాజాగా తేల్చి చెప్పింది. భార్యకున్న దురలవాటు విషయంలో భర్త లేవనెత్తిన అంశాలు వివాహ బంధాన్ని తెంపుకునేందుకు తీవ్రమైనవి కావంటూ ధర్మాసనం అభిప్రాయపడింది.

'విడాకులు మంజూరు చేస్తే.. వారి పిల్లలు తీవ్రంగా నష్టపోతారు. వారి యోగక్షేమాల దృష్ట్యా ఈ వివాహ బంధం తెగిపోకూడదు' అని పేర్కొంది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసే స్థాయి భర్త ఆరోపణలకు లేదని తెలిపింది.  
 
కాగా.. ఈ కేసు వేసిన వ్యక్తికి 2003లో వివాహమైంది. తదనంతర కాలంలో భార్యాభర్తల బంధం బీటలు వారింది. దీంతో అతడు విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. ఈ దురలవాటు కారణంగా ఆమె ఆరోగ్యం పాడై వైద్య ఖర్చులు తాను భరించలేని స్థాయికి చేరాయని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. తన తరుఫు బంధువులతో భార్య నిత్యం గొడవపడుతూ ఇల్లు నరకంగా మార్చిందంటూ విడాకులు మంజూరు చేయాలని కోరాడు. 
 
ఈ వాదనలు విన్న నాగ్‌పూర్ ఫ్యామిలీ కోర్టు విడాకులు ఇవ్వడం కుదరదని 2015లో నాగ్‌పూర్ ఫ్యామిలీ కోర్టు తీర్పు వెలువరించింది. వైద్య ఖర్చులకు సంబంధించి ఆధారాలను భర్త కోర్టుకు సమర్పించలేక పోయాడని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా.. ఇటువంటి చికాకులు ప్రతి కుటుంబంలో ఉంటూనే ఉంటాయని వ్యాఖ్యానించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు