శశికళ - నటరాజన్‌ల బంధంపై అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళ, నటరాజన్‌ల మధ్య ఎలాంటి బంధం లేదనీ, వారిద్దరు ఇపుడు భార్యాభర్తలు కాదన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు తమిళనాడులో సంచలనం రేపుతున్నాయి.
ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ శశికళ తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. అయితే, జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్లారు. ఆమె జైలుకెళుతూ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్‌ను నియమించారు. ప్రస్తుతం ఈయనే పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు.
అయితే, జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ శశికళ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లిపోతోందంటూ మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వర్గం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దినకరన్ స్పందిస్తూ అన్నాడీఎంకే పార్టీలో తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి స్థానం లేదన్నారు. 1990 నుంచే శశికళతో ఆమె భర్త నటరాజన్‌కు సంబంధాలు లేవన్నారు.