పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ ధీమా వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై వైకాపా, టీడీపీ అవిశ్వాస తీర్మానానికి సై అంటున్నాయి. ఇందుకోసం దేశంలోని ఇతర రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పార్లమెంట్ బయటా లోపలా ఎన్డీయే సర్కారుకు పూర్తి మద్దతు వుందని చెప్పారు.
టీడీపీ కొన్ని విషయాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని అవిశ్వాస తీర్మానం పెడదామని నిర్ణయం తీసుకుందని, కేంద్ర సర్కారు ఏపీ కోసం అదనంగా రూ.24వేల కోట్లు విడుదల చేసిందని అనంత్‌కుమార్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికీ ఇంత మొత్తంలో నిధులు ఇవ్వలేదన్నారు. ఏపీలో రాజధాని నిర్మాణానికి, పోలవరం, జాతీయ రహదారుల కోసం భారీ మొత్తాన్ని కేంద్రం ఇచ్చిందని చెప్పుకొచ్చారు.
మరోవైపు ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు పాటు టీడీపీ నేతలు, ఇతర పార్టీ నేతలు ఎంతగా కట్టుబడి వున్నారో.. అంతకంటే ఎక్కువగా కట్టుబడి వున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తెలిపారు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూనే ఉందని అన్నారు. ఏపీలో సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు.
ఎన్డీఏ నుంచి వైదొలగడం ద్వారా కేంద్ర సర్కారుపై అవిశ్వాసం తీర్మానం పెట్టడం ద్వారా టీడీపీ తనంతట తానుగా వ్యతిరేకంగా నిలబడిందని రామ్ మాధవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు లేవనెత్తిన ప్రశ్నలకు రాబోయే రోజుల్లో తాము సమాధానాలు చెబుతామని.. కానీ అంతకంటే ముందు బీజేపీ వేసే ప్రశ్నలకు చంద్రబాబు బదులివ్వాల్సి వుంటుందని రామ్ మాధవ్ అన్నారు.