టీకా వేస్తానంటే పాముతో కాటేయిస్తా.. సిబ్బందికి మహిళ బెదిరింపు

శనివారం, 16 అక్టోబరు 2021 (18:36 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇందులోభాగంగా, ఓ కరోనా టీకా వేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిని ఒక మహిళ పాముతో బెదిరించింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పిసాంగన్ ప్రాంతంలోని నాగెలావ్ గ్రామంలో ఇంటింటికి కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. పాములను పట్టి ఆడించే కమలా దేవి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లగా టీకా తీసుకునేందుకు ఆమె నిరాకరించింది. 
 
ఆమెకు ఎంతగానో నచ్చజెప్పేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించారు. అప్పటికీ వినలేదు. మొండిగా ప్రవర్తించి టీకా వేసేందుకు ప్రయత్నించారు. అంతే.. బుట్టలో నుంచి ఒక పామును తీసిన ఆ మహిళ.. తన ఇంటి నుంచి వెళ్లకపోతే పామును వారిపైకి విసురుతానని హెచ్చరించింది.
 
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కమలా దేవి ఇంటికి వచ్చారు. దీంతో వైద్య సిబ్బంది స్థానికుల సహాయం కోరారు. వారంతా ఆమెకు నచ్చజెప్పారు. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. దీంతో దిగి వచ్చిన కమలా దేవి చివరకు టీకా వేయించుకుంది. ఆమె తర్వాత స్థానికంగా ఉన్న 20 మంది కూడా వ్యాక్సిన్‌ పొందారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు