కావేరి జలాల వివాదంపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నోరువిప్పారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య తరచూ కావేరీ నీటి వివాదం ఇబ్బందిగా మారిందని వెంకయ్య వ్యాఖ్యానించారు. కానీ ఆందోళనల పేరిట ఆస్తులను ధ్వంసం చేయడం మంచిదికాదని వెంకయ్య హితవు పలికారు. ఆందోళనల పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని వెల్లడించారు. ఆందోళనలతో సమస్య పరిష్కారం కాదని, సామరస్యపూర్వక చర్చలు అవసరమన్నారు.
కాగా కావేరీ జలాల వివాదం మంగళవారం కర్ణాటక, తమిళనాడుల్లో భారీ విధ్వంసానికి దారితీసింది. రెండు రాష్ట్రాల్లో ఆందోళనకారులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. బెంగళూరు కెంగేరిలోని ద్వారకనాథ్ నగర వద్ద ఒకే ఆవరణలో నిలిపి ఉంచిన తమిళనాడు ప్రైవేటు రవాణా సంస్థ కేపీఎన్‌కు చెందిన 30, మరో సంస్థకు చెందిన 2 బస్సుల్ని దుండగులు తగులబెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 లారీలను ధ్వంసం చేశారు.
మరోవైపు కావేరి నదీ జలాల వివాదంపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం స్పందించారు. ఇరురాష్ట్రాల ప్రజలు సంయమనం పాటించాలని, సామాజిక బాధ్యతలను గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారా మాత్రమే సాధ్యపడతాయని అన్నారు.