ఇటీవల నటుడు విజయ్ పర్యటనలో కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కోలీవుడ్ సీనియర్ నటి అంబిక బాధితులను పరామర్శించేందుకు మంగళవారం నాడు వారి ఇళ్లకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు. ఇంకా ఎంతోమంది నటీనటులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఈ ఘటన ఎంతో దురదృష్టకరమైనది. ప్రాణాల విలువ వెలకట్టలేనిది.
నేను ఏ రాజకీయ పార్టీతోనూ కలిసి పనిచేయడం లేదు. ప్రత్యేకించి ఏ పార్టీతోనూ నాకు అనుబంధం లేదు. అందుకోసం ఇక్కడికి నేను రాలేదు. ఈ సంఘటనతో మానసికంగా నేను కూడా ఎంతో బాధపడ్డాను. కుటుంబ సభ్యులను కోల్పోయినవారిని ఓదార్చేందుకు నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి దీనికి ఎటువంటి రాజకీయ కారణం లేదు. ఈ సంఘటనలో బాధితులు నా మనవరాళ్ళు కావచ్చు. వారు నా పిల్లలు కావచ్చు. మరణించిన వారు నా సోదరుడు, తమ్ముడు, సోదరి, అత్త లేదా నా బంధువులు ఎవరైనా కావచ్చు అని అన్నారు.