కంపెనీలో సగం వాటా ఇస్తే ఉద్యోగం మానేస్తా.. భర్తకు కండిషన్ పెట్టిన భార్య!!

వరుణ్

శుక్రవారం, 28 జూన్ 2024 (14:17 IST)
తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఉచిత సలహా ఇచ్చిన భర్తకు భార్య ఓ కండిషన్ పెట్టింది. కంపెనీలో సగం వాటా రాసిస్తే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పింది. ఎంతో కష్టపడి సంపాదించికున్న ఉద్యోగాన్ని వదిలి వేయడం వల్ల భవిష్యత్‌లో ఏదేని అనుకోని సంఘటన జరిగి విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే నా భవిష్యత్‌కు భరోసా ఏంటని ఆమె ప్రశ్నించింది. అందుకే కంపెనీలో సగం వాటా రాసివ్వాలని కోరింది. దీనికి సంబంధించి ఓ మహిళ సోషల్‌ మీడియా రెడిట్‌లో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. తన భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఉద్యోగం వదిలిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి అన్న విషయాలను నెటిజన్లతో పంచుకున్నారు. 
 
ఆమె తన పోస్ట్‌లో 'నా భర్త, నేను వివాహం చేసుకుని ఆరేళ్లు అయింది. మాకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం నేను గర్భిణిని. పిల్లల బాగోగులు చూసుకోవాలంటే నేను ఉద్యోగం మానేసి పిల్లలను చూసుకొమ్మని మా ఆయన అన్నారు. ఆ మాటతో మానసికంగా కుంగిపోయాను. ఎంతో కష్టపడి సంపాదించిన ఉద్యోగం. ఇప్పుడు ఉద్యోగాన్ని వదులుకున్నా  ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ భవిష్యత్తులో అనుకోని పరిస్థితుల్లో మేము విడాకులు తీసుకోవాల్సివస్తే అప్పుడు నాకు ఏ ఆధారమూ ఉండదు.
 
అందుకే ఈ విషయంలో బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను. నా భర్త కంపెనీలో సగం వాటాను నాకు ఇస్తే ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో ఆయన ఆశ్చర్యపోయారు. నా స్నేహితులకు ఈ విషయం చెప్పినప్పుడు భర్తతో ఈవిధంగా ప్రవర్తిస్తావా.. ఇదేం పిచ్చి ప్రవర్తన? అంటూ మందలించారు. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా? సరైన దారిలోనే వెళ్తున్నానా? అని తేల్చుకోలేకపోతున్నాను. నాకు మీ సలహా కావాలి' అంటూ నెటిజన్లను కోరారు. 
 
దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఆమెకు మద్దతు తెలిపారు. మరికొందరు పిల్లల బాధ్యతను తల్లి చూసుకోవాలంటే ఇటువంటివి తప్పవు అంటూ హితవు పలికారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ 'ఆర్థిక భరోసా, సురక్షితమైన భవిష్యత్తు మీ ఆయనకు ఎలాగైతే ముఖ్యమో, మీకు కూడా అంతే అవసరం. ఆయన ఇంట్లో తన బాధ్యతలను కూడా మీపై వేయాలని చూస్తున్నారు. మీరు వాటా అడగడం మంచిదే' అంటూ రాసుకొచ్చారు. 
 
మరో నెటిజన్‌ స్పందిస్తూ 'మీరు తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ఎందుకంటే మీరు భయపడుతున్నట్లుగా భవిష్యత్తులో జరగకూడనిది జరిగితే మీకంటూ ఒక ఆధారం ఉంటుంది. మీ భర్త మీకు విడాకులు ఇచ్చినా మీరు భరణం కోసం ఆయనను వేడుకోవాల్సిన అవసరం ఉండదు' అని తెలిపారు. అనంతరం ఆమె మరో పోస్ట్‌లో తన భర్త తన భవిష్యత్తుకు భరోసా ఇస్తూ కంపెనీలో 49 శాతం వాటా ఇచ్చారని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన నెటిజన్లకు కృతజ్ఞతలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు