తుపాకీ లైసెన్సులు ఇప్పించినవారికే ఓట్లు వేస్తాం... ఓటర్ల వింత డిమాండ్!!!

శుక్రవారం, 27 అక్టోబరు 2023 (10:11 IST)
దేశంలో మినీ సమరంగా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ కూడా ఒకటి. అయితే, ఈ రాష్ట్రంలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలను ఓటర్లు వింత కోరికలు కోరుతున్నారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో ఓటర్లు కొత్త రకం డిమాండ్లు చేస్తుండటంతో ఖంగుతింటున్నారు. తమకు తుపాకీ లైసెన్స్ ఇప్పించే అభ్యర్థులకు మాత్రమే ఓట్లు వేస్తామని తెగేసి చెబుతున్నారు. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది. దీన్ని నిర్మూలించడానికి భిండ్ నియోజకవర్గ ఓటర్లు తమకు తుపాకీ లైసెన్సులు కావాలని కోరుతున్నారు. తుపాకీ లైసెన్స్ ఉంటే దేశంలో ఎక్కడైనా సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు చేసుకోవచ్చని వారి ఉద్దేశం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు కేంద్ర రాష్ట్రాల్లోని బీజేపీ పాలకులు ఎలాంటి పరిష్కారం చూపించలేదని, అందుకే తుపాకీ లైసెన్సుల డిమాండ్ న్యాయమైనదేనని భిండ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాకేశ్ సింగ్ చుతుర్వేది అంటున్నారు. ఇటు బీజేపీ అభ్యర్థి నరేంద్ర సింగ్ కుశ్వాహా కూడా అధికారంలోకి రాగానే ప్రభుత్వంతో మాట్లాడి ఓటర్ల డిమాండ్‌ను నెరవేరుస్తానని హామీ ఇస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు