సొంత కారు కూడా లేదని మమతా బెనర్జీ!!

శుక్రవారం, 12 మార్చి 2021 (07:39 IST)
సాధారణంగా ఒకసారి పంచాయతీ వార్డు మెంబరుగా ఎన్నికైనవారి ఆస్తులు ఆమాంతం పెరిగిపోతాయి. వారికి లగ్జరీ కారుతో ఇతర ఆస్తిపాస్తులు కూడా భారీగానే పెరిగిపోతాయి. కానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్ళపాటు పని చేసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కనీసం ఒక్క కారు కూడా లేదు. పైగా, ఆమె మొత్తం ఆస్తి కేవలం 16.72 లక్షలే. బంగారం కూడా 9 గ్రాములు మాత్రమే ఉందని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్నారు. 
 
గత ఎన్నికల్లో భవానీపూర్‌ నుంచి బరిలోకి దిగిన ఆమె... ఈ దఫా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. తన వద్ద ఉన్న నికర ఆస్తుల విలువ రూ.16.72 లక్షలేనని అఫిడవిట్‌లో మమత పేర్కొన్నారు. 2019-20లో రూ.10,34,370 ఆదాయం వచ్చిందని తెలిపారు. అలాగే, రూ.69,255 నగదు ఉండగా, రూ.13.53 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. 
 
ఎన్నికల ఖర్చుకు సంబంధించిన రూ.1.51 లక్షలు కూడా అందులోనే ఉందని మమత వివరించారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్‌సీ)లో రూ.18,490 పొదుపు చేశానని, 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను చెల్లించిన ఆదాయపన్నులో టీడీఎస్ రూపంలో రూ.1.85 లక్షలు వెనక్కి రావాల్సి ఉందన్నారు. అలాగే, తన వద్ద 43,837 విలువైన 9 గ్రాముల బంగారం ఉందని తెలిపారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశానని, ఎల్ఎల్‌బీ కూడా చదివానని పేర్కొన్న మమత తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగులో లేవన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు