మార్కెట్‌లో ఉరివేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే... ఎక్కడ?

సోమవారం, 13 జులై 2020 (11:51 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి విపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే బెంగాల్ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడుపై కూడా దాడి జరిగింది. అలాగే, మరికొందరు ఎమ్మెల్యేలపై కూడా దాడి జరిగిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా బీజేపీకి చెందిన దేవేంద్రనాథ్ రాయ్ అనే ఎమ్మెల్యే దినాజ్‌పూర్‌లోని ఓ మార్కెట్‌లో ఉరేసుకొని చనిపోయారు. 
 
ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. అయితే బీజేపీ మాత్రం దీనిని హత్యే అని ఆరోపిస్తోంది. ఓ షాపు దగ్గర ఎమ్మెల్యే ఉరేసుకున్నట్లు తాము గుర్తించామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు ప్రకటించారు. అయితే ఈయన ఎందుకు ఉరేసుకున్నారన్నది మాత్రం పోలీసులు విచారణ చేస్తున్నారు. 
 
ఈ సంఘటనపై బెంగాల్ బీజేపీ ట్వీట్ చేస్తూ... 'ఉత్తర దినాజ్‌పూర్‌లోని రిజర్వ్‌డ్ సీట్ అయిన హేమతాబాద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ ఇంటికి సమీపంలో ఉరేసుకున్నట్లు గుర్తించారు. ఆయన్ను ఎవరో చంపారు. ఆ తర్వాతే ఉరి తీశారు. ఆయన 2019లో బీజేపీలో చేరారు. ఇదే ఆయన చేసిన తప్పేమో?' అని బీజేపీ ట్వీట్ చేసింది.
 
మరోవైపు, ఎమ్మెల్యే ఉరి ఘటనపై బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ధన్కర్ స్పందించారు. 'ఈ ఉదంతం అనేక ఆరోపణలకు తావిస్తోంది. హత్య చేశారన్న ఆరోపణలూ వస్తున్నాయి. సత్యాన్ని ఆవిష్కరించడానికి, రాజకీయ హింసను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం నిష్పక్షపాతమైన దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉంది' అంటూ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు