ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు విమర్శల వర్షం కురిపించారు. చౌకీదార్ కాస్త చోర్ అయ్యారంటూ మండిపడ్డారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మాపోరాట దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతల తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా అని నిలదీశారు. గత ప్రధాని ఇచ్చిన హామీలను ఈ ప్రధాని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
'ఏపీ ప్రజలకు అండగా ఉంటాను. ఎక్కడికి వెళితే అక్కడ మోడీ అబద్దాలు మాట్లాడుతున్నారు. ఆయనపై నమ్మకం పోయింది. ఈ దేశ ప్రజల సెంటిమెంట్ ఎలా ఉంటుందో రెండు నెలల్లో చూపిస్తాం. రాఫెల్ గురించి పత్రికల్లో ఏ వార్త వచ్చిందో తెలియదా? చౌకీదార్ చోర్ అయ్యాడు. ఏపీ ప్రజల సొమ్మును .. అనిల్ అంబానీకి దోచి పెట్టారు. మోడీని, బీజేపీని ఓడిద్దాం' అంటూ ధర్మపోరాట దీక్షా వేదిక సందర్భంగా పిలుపునిచ్చారు.