సాధారణంగా కొందరు ప్రయాణికులు బస్సులు, కార్లు, క్యాబుల్లో ప్రయాణం చేస్తూ తల, చేతులు బయటపెడుతుంటారు. ఇలాంటి వారికి కొన్ని సందర్భాల్లో జరగరానిది జరిగిపోతుంది. తాజాగా కర్నాటక రాష్ట్రంలో ఓ మహిళ కంపెనీ క్యాబులో ప్రయాణిస్తుండగా వాంతులు వస్తున్నాయని తల బయటపెట్టింది. అంతే.. కళ్లు తెరిచే లోపు ఆమె తల తెగిపడిపోయింది., ఈ దారుణ ఘటన మైసూరులో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
బేగూరు సమీపంలోని ఆలహళ్ళి అనే గ్రామానికి చెందిన శివలింగమ్మ (58) అనే మహిళ ఓ క్యాబులో కుడివైపు సీటులో కూర్చొని ప్రయాణిస్తుండగా, ఆమెకు ఉన్నట్టుండి వాంతులు వచ్చాయి. దీంతో తల బయటకు పెట్టి వాంతి చేసుకుంటుండగా, ఒక్కసారిగా దూసుకొచ్చిన తాలీ ఆమె తల, కుడిచేయిని తాకింది. అంతే.. క్షణాల్లో ఆ రెండు తెగిపోయి రోడ్డుపై పడ్డాయి.
ఈ ప్రమాదంలో మరో ప్రయాణికురాలి కుడిచేతికి కూడా ఫ్రాక్చర్ అయింది. బెంగుళూరులో జరిగిన తమ బంధువు నిశ్చితార్థ వేడుకలో పాల్గొని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా శనివారం ఈ ఘోరం జరిగింది. చామరాజనగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదం, మైసూరు రహదారిలో గుండల్‌పేట్ వద్ద జరిగిందని పోలీసులు వెల్లడించారు.