ది ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ జెంన్జో తాజాగా క్యాబ్ తరహాలో అంబులెన్స్ సేవలను ప్రవేశపెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేసిన కేవలం 15 నిమిషాల్లోనే అంబులెన్స్ సదుపాయాన్ని కల్పించనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 450 నగరాల్లో 25 వేల అంబులెన్స్‌లను జెన్జో ప్రారంభించింది. అత్యవసర సమయాల్లో స్పందించే తీరు, ప్రథమ చికిత్స సీపీఆర్ శిక్షణ అందించేందుకు జొమాటో సహా ఇతర ఈ-కామర్స్ సంస్థలతో జట్టు కట్టినట్టు జెన్జో తెలిపింది.
మెడికల్ ఎమర్జెన్సీ సేవల మౌలిక సదుపాయాలను డిజిటల్ టెక్నాలజీ సాయంతో అందించడమే తమ లక్ష్యమని జెన్జో సహ వ్యవస్థాపకులు, ఈసీఓ శ్వేత మంగళ్ తెలిపారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో 1800 102 1298 అనే టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు.
దేశంలో ఆరోగ్యం సంరక్షణ, మౌలిక సదుపాయాల బలోపేతం చేసేందుకు ఆస్పత్రిలు, స్థానిక అధికారులు, కార్పొరేట్, ప్రైవేటు అంబులెన్స్‌లతో జట్టు కట్టినట్టు కంపెనీ వెల్లడించింది. డిమాండ్‌ను బట్టి అంబులెన్స్‌ల సంఖ్యను పెంచుతామని శ్వేత మంగళ్ వెల్లడించారు. అలాగే, ఈ సేవలను మరిన్ని నగరాలకు కూడా విస్తరిస్తామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఒకే తరహా చార్జీల విధానం ఉంటుందని తెలిపారు.
మొదటి ఐదు కిలోమీటర్లకు బేసిక్ అంబులెన్స్ ధర రూ.1500గాను, కార్డియాక్ అంబులెన్స్‌కు తొలి ఐదు కిలోమీటర్లకు రూ.2500గా నిర్ణయించినట్టు తెలిపారు. ఐదు కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రతి కిలోమీటరుకు బేసిక్ అంబులెన్స్‌కు రూ.50 చొప్పున, కార్డియాక్ అంబులెన్స్‌కు రూ.100 చొప్పున చార్జ్ చేస్తామని పేర్కొన్నారు.