ఆర్కేనగర్ బైపోల్ : తమిళనాడు వైద్యమంత్రి ఇంట్లో ఐటీ రైడ్స్.. హీరో శరత్ కుమార్ నివాసంలో కూడా...

శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (10:03 IST)
చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 12వ తేదీ ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో శశికళ వర్గం నుంచి అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. ఆయనకు తమిళ హీరో, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్ కుమార్ మద్దతు ప్రకటించారు. 
 
ఈ మద్దతు ప్రకటించిన 24 గంటల్లోనే ఆయన నివాసంతో పాటు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి విజయభాస్కర్ నివాసాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిచారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఆర్కేనగర్ ఓటర్లకు పంపిణీ చేసేందుకే మంత్రి ఇంట్లో నిల్వచేసినట్టు సమాచారం. 
 
మరోవైపు సినీ నటుడు శరత్ కుమార్ ఇంటిపై శుక్రవారం ఐటీ దాడులు జరుగుతున్నాయి. కొట్టివక్కమ్‌లోని శరత్ కుమార్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దినకరన్‌కు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఆయన ఇంటిపై ఐటీ సోదాలు జరగడం గమనార్హం. అంతేగాక, అన్నాడీఎంకే మాజీ ఎంపీ రాజేంద్రన్, ఎంజీఆర్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ గీతా లక్ష్మి, ఇతర పారిశ్రామికవేత్తల నివాసాలతో పాటు.. దాదాపు 30 చోట్ల ఏక కాలంలో ఈ సోదాలు జరిగాయి. 

వెబ్దునియా పై చదవండి