Kantara Chapter-1 Review: కాంతార: చాప్టర్-1 చిత్రంతో రిషబ్ శెట్టి కు విజయం దక్కిందా.. కాంతార 1.రివ్యూ

చిత్రాసేన్

శుక్రవారం, 3 అక్టోబరు 2025 (10:19 IST)
Kantara: Chapter-1 _ Rishab
నటీనటులు: రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య,జయరాం, ప్రకాష్, ప్రమోద్ శెట్టి తదితరులు 
సాంకేతికత: సంగీతం: అజనీష్ లోక్ నాథ్ ఛాయాగ్రహణం: అరవింద్ కశ్యప్ నిర్మాత: విజయ్ కిరగందూర్ రచన-దర్శకత్వం: రిషబ్ శెట్టి.
 
కర్నాటకలోని అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో జరిగిన సంఘటన బేస్ చేసుకుని దేశవ్యాప్తంగా తెలిసేలా చేసి మూలకథగా తెరకెక్కించిన కాంతార అందరికీ నచ్చేలా చేసింది. మూడేళ్ళనాడు వచ్చిన ఆ సినిమాకు సీక్వెల్ గా కాంతార: చాప్టర్-1 వచ్చింది. ఈసారి హీరోనే దర్శకుడు. ఎంత నమ్మకంతోనే తీసిన ఈ సినిమాకు కాంతార: చాప్టర్-2 కూడా వుంటుందని ధీమాగా తెలియజేయడం కూడా విశేషమే. మరి దసరానాడు విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
కొన్ని వందల ఏళ్ల కిందట కర్నాటకలోని ఓ అటవీ ప్రాంతం కాంతార.  అక్కడ పార్వతి పూలతోట అనేది నెలకొంది. అక్కడ శివుడు తన గణాలను ధర్మం కాపాడడానికి అప్పుడప్పుడు పంపిస్తుంటాడు. అటవీ సంపద బాగా వున్న ఆ ప్రాంతంపై పక్కనే వున్న భాంగ్రా ప్రాంతానికి చెందిన రాజు కన్నుపడుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను బానిసలుగాచేసుకుని విదేశీ వర్తలకు అమ్మేస్తుంటాడు రాజు. ఓరోజు కాంతార ప్రాంతానికి వచ్చి అక్కడ సంపదను దక్కించుకుకునే క్రమంలో రాజు అంతమవుతాడు. ఇది కళ్ళార చూసిన  ఆ రాజు తనయుడు విజయేంద్ర (జయరాం) పెరిగి పెద్దవాడై రాజ్యపాలన చేసిన అనంతరం తన కొడుకు కులశేఖరుడికి (గుల్షన్ దేవయ్య) పట్టాభిషేకం చేస్తాడు. అంటే చనిపోయిన రాజుకు మనవడు కులశేఖర్.
 
వ్యసనపరుడైన కులశేఖరుడు రాజ్యపాలను పట్టించుకోకుండా కాంతారపై దాడిచేసి అక్కడిప్రజలను చాలామందిని చంపేస్తాడు. ఆ సమయంలో కాంతార తెగకు నాయకుడైన బర్మే (రిషబ్ శెట్టి) పోరాడి కులశేఖరుడిని అంతమొందిస్తాడు. ఈ విషయం తెలిసిన రాజు కూతురు రుక్మిణి వసంత్ ఏమి చేసింది? అసలు బర్మే ఎవరు? ఆయనకున్న శక్తులు ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
Kantara: Chapter-1 _ Rishab
సమీక్ష:
వందల ఏళ్ళ నాటి కథలతో ఇప్పటితరానికి తెలీని చాలా విషయాలు, కొత్త లోకాన్ని చూపిస్తూ దర్శక నిర్మాతలు విజయం సాధిస్తున్నారు. అలాంటివాటిల్లో కాంతార ఒకటి అని చెప్పవచ్చు. పురాణాల నుంచి నేటివరకూ జరుగుతున్నది ఒక్కటే. పాలన చేస్తున్న వారు ప్రజలను పీడించి బానిసలుగా చేసుకోవడమే. అందుకే ఇలాంటి కథలు ప్రజలకు ఈజీగా కనెక్ట్ అవుతున్నాయి. రిషబ్ శెట్టి కొత్త వాడయినా కథలో సరికొత్త దనం వుండడంతో ప్రేక్షకులు ఇన్ వాల్వ్ అవుతున్నారనే చెప్పాలి.
 
సహజంగా సినిమా సక్సెస్ అయితే దాని సీక్వెల్ తో క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని అనుకోకుండా ప్రేక్షకులకు ఇంకా గొప్ప అనుభూతిని పంచాలనే ఉద్దేశంతో మరింత భారీతనం ఉన్న కథతో వచ్చాడు ఈసారి. ఆ భారీతనంతోపాటు ఎక్కడా విసుగుపుట్టించకుండా చేయడం విశేషం. మొదటి నుంచి సరదాగా హీరో పాత్ర డిజైన్ చేసినా ఆ పాత్ర పుట్టుక, అతను చేసిన విశ్వరూపం కట్టిపడేస్తుంది. మధ్యలో కొంత సాగదీతగా వున్నా కథనం సాగడం కోసం అక్కడడక్కడా ఎంటర్ టైన్ మెంట్ వుండేలా చర్యలు తీసుకున్నాడు.
 
కథలోని వాస్తవం. నేపథ్యం భిన్నమైనదే అయినప్పటికీ.. ఒక మహారాణి.. ఒక అడవి మనిషి మధ్య సగటు ప్రేమకథ నేపథ్యం, జైలులో బంధించడం వంటివి సగటు సినిమాలాగా చూపించాడు. ఒకవైపు ఇటువైపు ఒక రాజ్యం.. మరోవైపు అడవిలో ఒక తెగ.. వీరి మధ్య ఆధిపత్య పోరాటం.. ఇంకోవైపు రాణి-తెగ నాయకుడికి మధ్య ప్రేమ సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందింది. ఈ కథకు సాంకేతిక చాలా హెల్ప్ అయింది. యాక్షన్ ఘట్టంతో రిషబ్ విజువల్ మాయాజాలం మొదలవుతుంది. ఇక ద్వితీయార్ధంలోకి అడుగుపెట్టాక ప్రేక్షకులకు కళ్లార్పలేరు. కథలో కూడా అక్కడి నుంచే రక్తి కడుతుంది. ఇదే తీవ్రతతో సాగి ప్రేక్షకులను మరో లోకంలో విహరింపజేస్తుంది. 
 
సాంకేతికపరంగా విజువల్స్, ఎఫెక్ట్ లు, మలుపులు భారీతనాన్ని తెచ్చాయి.ఇండియన్ సినిమా లోనే సరికొత్తగా అనిపించేలా హీరో నటన సాగుతుంది తన పెర్ఫామెన్స్. ఒకే సమయంలో నటుడిగా.. దర్శకుడిగానూ అతను విశ్వరూపం చూపించాడు. ఈ మేలు కలయికే ‘కాంతార: చాప్టర్-1’కు మేజర్ హైలైట్. ప్రథమార్ధంలో చోటు చేసుకున్న లోటుపాట్లన్నీ కూడా భర్తీ అయిపోయేలా ద్వితీయార్ధం ఉండడంతో అంతిమంగా ‘కాంతార: చాప్టర్-1’ ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగిలుస్తుంది. ‘కాంతార: చాప్టర్-2’ మీద మరిన్ని అంచనాలు రేకెత్తిస్తూ సినిమా ముగుస్తుంది. 
 
నటీనటుల పరంగా అందరూ బాగానే నటించారనే చెప్పాలి. అయితే కొన్ని లోపాలున్నాయి. కులశేఖరుడికి రుక్మిణి వసంత్ సోదరి అవుతుందని మొదట చెబుతారు. కానీ క్లయిమాక్స్ లో జయరాం ను తాత అని సంభోదిస్తుంది. కొడుకు అసమర్థుడు అని తెలిసి కూడా పట్టాభిషేకం చేస్తాడు జయరాం. అదేమంటే నా పట్టాభిషేకం తన తండ్రి చూడలేకపోయాడని లాజిక్ చెప్పాడు. బాగానే వున్నా. కొడుకు ఏం చేస్తున్నాడు? పాలనా పరంగా పనికిరాడని తెలిసినా ఏమీతెలీనట్లు వుంటాడు. కాంతారకు దుష్టఆలోచనతో వెళితే చనిపోతారని తెలుసు. అలాంటిది కొడుకు అక్కడికి వెళుతున్నారని వేగులవారు కనీసం తండ్రికి చెప్పకపోవడం విశేషం. ఏది ఏమైనా కథలో భాగంగా దర్శకుడు బాగా డీల్ చేశాడనే చెప్పాలి.
 
పతాక సన్నివేశాల్లో కూడా రిషబ్ నటన సంచలన రీతిలో సాగింది. సప్తసాగరాలు దాటి సినిమా తర్వాత రుక్మిణి వసంత్ కు మంచి పాత్ర దక్కింది. వయసు మీద పడ్డ రాజు పాత్రలో జయరాం ఆకట్టుకున్నాడు. ప్రకాష్ తుమినాడ్.. మిగతా ఆర్టిస్టులందరూ బాగానే చేశారు. 
 
సాంకేతికంగా ప్రతి టెక్నీషియన్ ది బెస్ట్ ఇచ్చారు. అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం అలరించింది. ద్వితీయార్ధంలో సన్నివేశాలకు తగ్గట్లే తన ఆర్ఆర్ పతాక స్థాయిలో సాగింది. అరవింద్ కశ్యప్ ఛాయాగ్రహణం  అత్యున్నత స్థాయిలో సాగింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కృషి గురించి ఎంత చెప్పినా తక్కువ. హోంబలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయి. ప్రథమార్ధంలో కాస్త రొటీన్ గా పలు సినిమాలు చూసిన ఫీలింగ్ వచ్చినా రానురాను ఆ ఆలోచన రానీయకుండా చేశాడు. సినిమాలో కంటెంట్ తో పాటుగా రిషబ్ శెట్టి మెస్మరైజింగ్ పెర్ఫామెన్స్ చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు. కొన్ని మెయిన్ సీన్స్ తో తన నటన అమోఘం అని కొనియాడుతున్నారు కూడా. ఇలా మొత్తానికి ఈ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ లో రెండు సినిమాలకి కూడా రిషబ్ శెట్టి తనతో ఆడియెన్స్ మనసులు దోచుకున్నాడని చెప్పవచ్చు.
రేటింగ్: 3/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు