ఈ నెల 9 నుండి దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ 9 రోజులు అమ్మగారిని భక్తి శ్రద్దలతో పూజించినవారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో, వాళ్లు తనకు అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి.
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. నవరాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. ఈ అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని 'శరన్నవరాత్రి ఉత్సవాలు'గా, 'దేవీనవరాత్రులు'గా పిలుస్తుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది.
భక్తులు ఈ తొమ్మిది రోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో రూపంగా అలంకరించబడిన అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఇలా తొమ్మిది రోజుల పాటు నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు ... సంతాన సౌభాగ్యాలు ... సుఖశాంతులు చేకూరుతాయని పండితులు అంటున్నారు.