వైఎస్ సంతాప సభల్లో ఎన్నారైల ఘన నివాళి...!!

FILE
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణానికి చింతిస్తూ విదేశాల్లోని పలువురు ఎన్నారైలు ఘనంగా సంతాపసభలను నిర్వహించారు. తెలుగువారి అభివృద్ధి ఎనలేని కృషి చేసిన వైఎస్సార్ ఆకస్మికంగా మృతి చెందడం తమ మనసులను కలచివేసిందని వారు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు.

పేదల అభ్యున్నతి కోసం, అన్నదాతలను ఆదుకునేందుకు, మహిళా సాధికారతకు, శిశు సంక్షేమానికి.. ఇలా పేదలకు అన్ని రకాలుగా వైఎస్సార్ చేసిన సేవలు మరువరానివని షికాగో తెలుగు అసోసియేషన్ (సీటీఏ) సంతాపసభలో వ్యాఖ్యానించింది. డైనమిక్ నాయకుడిగా, అభ్యుదయవాదిగా, మనసున్న మనిషిగా వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంచారని సీటీఏ ప్రతినిధి రావు అచంట ఈ సందర్భంగా శ్లాఘించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షికాగో తెలుగు అసోసియేషన్ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేసింది. వైఎస్ మరణం తెలుగువారి గుండెల్లో చెప్పలేనంత శూన్యాన్ని నింపిందని, అయినప్పటికీ మన హృదయాల్లోనే ఆయన ఎప్పటికీ చిరస్మరణీయుడిగానే నిలిచి ఉంటారని సిటిఎ తన సంతాప సందేశంలో పేర్కొంది. వైఎస్ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని సిటిఎ ప్రార్థిస్తున్నట్లు రావు ఆచంట తెలిపారు.

అలాగే గ్రేటర్ షికాగో హిందూ దేవాలయం, స్థానిక తెలుగు సంఘాలైన టీఏడీసీ, టీటీఏ, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఆటా, నాట్స్... తదితర సంస్థలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానికి నివాళులు అర్పిస్తూ ఘనంగా సంతాప సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సంఘాలు వైఎస్సార్‌ కుటుంబానికి తమ సానుభూతిని తెలుపటమే గాకుండా.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

వెబ్దునియా పై చదవండి