"వైట్‌హౌస్ ఫెలోస్"గా ఎన్నారైల ఎంపిక

ప్రతిష్టాత్మక "వైట్‌హౌస్ ఫెలోస్"గా.. భారతీయ సంతతికి చెందిన నలుగురు అమెరికన్లను ఎంపిక చేశారు. సుదీప్ బోస్, అనీశ్ మహాజన్, రాజా షా, మనీశ్ సేథీ అనే ఈ నలుగురిని... అమెరికాకు భవిష్యత్ నాయకులుగా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా ఓ ప్రకటనలో అభివర్ణించారు.

వైట్‌హౌస్ ఫెలోస్‌గా ఎంపికయిన ఈ ఇండియన్ అమెరికన్లు.. తమ తమ వృత్తుల్లో సేవా దృక్పథాన్ని చొప్పించగలిగారని ఈ సందర్భంగా వైట్‌హౌస్ ప్రశంసించింది. కాగా... సుదీప్ బోస్ షికాగోలోని అడ్వకేట్ క్రెస్ట్ మెడికల్ సెంటర్‌లో వైద్యుడు కాగా, అనీశ్ మహాజన్ న్యూయార్క్‌లో రాబర్ట్ ఉడ్ జాన్సన్ క్లినికల్ స్కాలర్‌గా పనిచేస్తున్నారు. ఇక మనీశ్ సేథీ మసాచుసెట్స్‌లో సర్జికల్ రెసిడెంట్‌ కాగా, రాజా షా పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎంబీఏ విద్యను అభ్యసిస్తున్నారు.

ఇదిలా ఉంటే... వైట్‌హౌస్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం దేశ వ్యాప్తంగా 30 మందిని ఎంపిక చేయగా... వీరిలో నలుగురు భారతీయ సంతతికి చెందిన అమెరికన్లు ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి