కొన్ని రంగాల్లోనే రాణించిన సినీ మహిళలు

Raju

శుక్రవారం, 29 ఆగస్టు 2008 (19:15 IST)
నాటినుంచి నేటివరకు సినిమారంగంలో కూడా మహిళలు తమ ప్రతిభను ప్రదర్శించి సినిమాల విజయానికి కారణమైనప్పటికి వారి ప్రతిభను మాత్రం మెచ్చుకునేవారు తక్కువ. సినిమారంగంలో మహిళలకు సంబంధించి గమనిస్తే హీరోయిన్లు, గాయనీమణులు, కొరియోగ్రాఫర్స్ వంటి రంగాల్లో తప్పిస్తే మిగతా విభాగాల్లో వారి సంఖ్య స్వల్పం. దీనికి ముఖ్యకారణం పురుషాధిక్యమే కారణమని చెప్పవచ్చు.

మహిళలు తమ ప్రతిభాపాటవాలతో అన్నిరంగాల్లో ముందంజ వేస్తున్నప్పటికి వారిపట్ల వివక్ష మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని రంగాల్లో వారు తమ విజయబావుటాను ఎగుర వేశారు. ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ, సినిమారంగాల్లో వారి ప్రతిభ వెల్లడి అవుతున్నప్పటికి ఇంకా వారిపట్ల కొన్నిచోట్ల వివక్ష కొనసాగుతున్నదనే మాట వాస్తవం.

సినిమాకు పూర్వం ఉన్న నాటకరంగంలో కూడా మహిళలు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేశారు. తరువాత వారు సినీరంగంలోకి ప్రవేశించారు. తొలి సినీ నటిగా సురభి కమలాభాయిని చెబుతారు. 1931లో వచ్చిన తొలిచిత్రం "భక్త ప్రహ్లద"లో ఆమె హీరోయిన్‌గా నటించారు. అప్పట్లో సినీరంగంలోకి వెళ్లినవారిపై సదభిప్రాయం ఉండేది కాదు.

దాంతో వారు నిజజీవితంలో కుడా కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సినిమా పుట్టిన తరువాత తొలిరోజుల్లో నటనకే పరిమితమైన మహిళలు వివిధ శాఖల్లో కూడా తమ ప్రతిభను ప్రదర్శించారు. కాంచనమాల, కన్నాంబ, భానుమతి, సావిత్రి, అంజలీదేవి, షావుకారు జానకి, క్రిష్ణకుమారి, బి. సరోజాదేవి, దేవిక, జమున, వాణిశ్రీ, విజయనిర్మల, మనోరమ, జయసుద, జయప్రద, శ్రీదేవి, విజయశాంతి, రోజా వంటి హీరోయిన్లు తమ నటనతొ సినీరంగంలో ఒక వెలుగు వెలిగారు.

వీరిలో భానుమతి నటిగానే కాకుండా గాయనిగా, సంగీత దర్శకురాలిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా, బహుముఖ ప్రతిభను ప్రదర్శించి సినీరంగంలో చిరస్మరణీయురాలిగా నిలిచారు. సావిత్రి కూడా దర్శక, నిర్మాతగా కూడా వ్యవహరించారు. మరో నటి అంజలీదేవి కూడా నిర్మాతగా పలు చిత్రాలను తీశారు. కాగా, అత్యధిక చిత్రాలను చేసిన నటీమణిగా మనోరమను పేర్కొంటారు.

విజయనిర్మల పాత తరం నటీమణిగానే కాకుండా ప్రస్తుతం దర్శకురాలిగా కూడా తన ప్రతిభను ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. సహజంగా నటించడంలో పేరు పొందిన జయసుద ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అందాల తార జయప్రద నేడు పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నప్పటికి సినిమాల్లో కూడా అప్పుడప్పుడు నటిస్తూ తన అభిరుచిని చాటుకుంటున్నారు.

ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ వంటి వేలాది పాటలను పాడిన గంధర్వ గాయని పి.సుశీల. నేటికి ఆమె గానాన్ని విని పరవశించని వారు లేరు. ఇటీవలనే ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. అద్భుతమైన మరో మధురకంఠం ఎస్. జానకి సొంతం. సిరిమల్లె పువ్వా అంటూ ఆమె పాడిన పాటలు నేటికి జనాన్ని పరవశింపజేస్తూనే ఉన్నాయి.

చిత్ర, సునీత వంటి గాయనీమణులు తమ గానంతొ అందరి ప్రశంసలను పొందుతున్నారు. సంగీత దర్శకత్వంలో శ్రీలేఖ పేరు గడించారు. నటిగా కెరీర్‌ను ప్రారంభించిన జీవిత ఇప్పుడు డైరెక్టర్‌గా పనిచేయటానికి ఉత్సాహం చూపుతున్నారు. కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ దర్శకత్వంలొ కూడా ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. తెర వెనుక గాయణీమణులు తప్పిస్తే, ఇతర రంగాల్లొ మహిళలు తక్కువగానే ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి