నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. జిల్లాలో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా కేసులో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా, ఆయన వద్ద జరిగిన విచారణలో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా గుట్టును బహిర్గతం చేశారు. కాగా, ఇదే కేసులో ఇదే జిల్లాకు చెందిన వైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, ఆయన జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
శ్రీకాంత్ రెడ్డి వెల్లడించిన విచారణలో.. "అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్ రెడ్డితో నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. 2023 ఆగస్టు నుంచి అనిల్, కాకాణితో క్వార్ట్జ్ వ్యాపారం చేశాను. లీజు గడువు ముగిసినా రుస్తుం మైన్ నుంచి క్వార్ట్జ్ తీశాం. వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాస రెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు. పర్యవేక్షించినందుకు నాకు టన్నుకు రూ.1000 ఇచ్చేవారు. క్వార్ట్జ్ ఏనుగు శశిధర్ రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్లం. ఆయనకు ఎకరాకు రూ.25 వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాం.
రుస్తుం మైన్ నుంచి తీసిన క్వార్ట్జ్ చైనాకు పంపాం. దువ్వారు శ్రీకాంత్ రెడ్డితో క్వార్ట్జ్ ఎగుమతి చేయించేవాళ్లం. వచ్చిన డబ్బుతో స్థిరాస్తి వ్యాపారం చేశాం. నేను, అనిల్ కలిసి గూడూరులో 100 ఎకరాల్లో, నాయుడుపేట వద్ద 50 ఎకరాల్లో వెంచర్లు వేశాం. హైదరాబాద్ నగరంలో రెండు హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాం. మణికొండ అల్కాపురిలో హెవెన్లీ హోమ్స్, తుర్కయాంజల్లో గ్రీన్ మెడోస్ పేరిట వెంచర్లు వేశాం. 2024లో ప్రభుత్వం మారాక కేసులకు భయపడి నేను హైదరాబాద్ నగరానికి మకాం మార్చాను" అని శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు తెలిపినట్టు సమాచారం.
కాగా, శ్రీకాంత్ రెడ్డిని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించింది. రుస్తుం మైన్స్ తవ్వకాల కేసులో నెల్లూరు రూరల్ పోలీసులు ఆయనను గూడూరు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నెల్లూరు జైలుకు తరలించారు. ఈ కేసులో శ్రీకాంత్ ఏ12గా ఉన్నారు.