నవరాత్రులు ప్రారంభం.. తొలిరోజు శైలపుత్రీ పూజ.. ఎలా చేయాలి?

సెల్వి

సోమవారం, 22 సెప్టెంబరు 2025 (09:48 IST)
Sailaputhri
నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గా, లక్ష్మి, సరస్వతి రూపాల్లో దుర్గాదేవిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ తొమ్మిది రోజులు నిష్ఠతో అమ్మవారిని పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఈ తొమ్మిది రోజులు సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం. నవరాత్రులకు ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అనవసరమైన గొడవలు, చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ధ్యానం, కీర్తనల ద్వారా మన మనస్సును దైవానికి అంకితం చేయాలి. 
 
ఉల్లి, వెల్లుల్లి, ఆల్కహాల్ వంటివి పూర్తిగా మానేయాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. తొలి రోజు శైలపుత్రి అమ్మవారిని పూజిస్తారు. తల్లి ఎద్దు మీద కూర్చుని ఎడమ చేతిలో పుష్పం, కుడి చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది. ఈ అమ్మవారిని కరుణ, సహనం, ఆప్యాయతకు చిహ్నంగా భావిస్తారు. 
 
త్రిమూర్తులకు ఉన్న అన్ని శక్తులు ఈ అమ్మవారికి ఉన్నాయని ప్రజల విశ్వాసం. పైగా శైలపుత్రి అమ్మవారు చంద్రగ్రహానికి అధిపతి. మీ జాతకంలో చంద్ర దోషం ఉంటే ఈ మాతను ఆరాధించడం వల్ల దాని నుండి విముక్తి పొందుతారు. శైలపుత్ర అమ్మవారి విగ్రహం లేదా ప్రతిమను ప్రతిష్టించాలి. 
 
కలశ స్థాపన చేసి అమ్మవారి ముందు నెయ్యితో అఖండ జ్యోతిని వెలిగించాలి. షోడశ ఉపచారాలతో పూజ నిర్వహించాలి. అమ్మవారికి కుంకుమ, తెల్ల చందనం, పసుపు, అక్షతలు, తమలపాకులు, కొబ్బరి సహా మహిళలకు సంబంధించిన అలంకరణ వస్తువులను సమర్పించాలి. 
 
దీంతోపాటు తెల్లని పువ్వులు, తెల్లని స్వీట్లు కూడా పెట్టాలి. ఆ తర్వాత శైలపుత్రి అమ్మవారి బీజ మంత్రాలను జపించాలి. అమ్మవారిని పూజించేటప్పుడు ఓం దేవి శైలపుత్రయే నమ: అనే మంత్రాన్ని పఠించాలి. దీంతోపాటు పూజలో అమ్మవారికి పాలు, స్వచ్ఛమైన నెయ్యితో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టడం ఉత్తమం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు