హయగ్రీవునికి బుధవారం యాలకుల మాల సమర్పిస్తే..? (video)

బుధవారం, 7 అక్టోబరు 2020 (05:00 IST)
హయగ్రీవునిని బుధవారం పూజించడం ద్వారా ఉన్నత విద్యావకాశాలు చేకూరుతాయి. ఉన్నత పదవులను అలంకరిస్తారు. సాధారణంగా కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు, ''ఇక ఆ భగవంతుడే చల్లగా చూడాలి'' అని అంటూ వుంటారు. అలా తన భక్తులను చల్లగా చూడటం కోసమే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు. అలాంటి అవతారాల్లో 'హయగ్రీవావతారం' ఒకటి. 
 
పూర్వం 'హయగ్రీవుడు' అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు ... బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారాన్ని పోలినవారి చేతిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు. వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను నానారకాలుగా హింసించసాగాడు. దాంతో దేవతలంతా ఆది దంపతులను శరణువేడారు. 
 
యోగ నిద్రలో వున్న విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీ దేవి వారితో చెప్పింది. శ్రీ మహావిష్ణువు తన 'విల్లు' చివరి భాగాన్నిగెడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు 'చెద' పురుగుగా మారి వింటి తాడును తెంపాడు.
 
వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగదన్నడంతో శ్రీ మహావిష్ణువు తల...శరీరం నుంచి వేరైపోయింది. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. అమ్మవారితో సహా దేవాధి దేవతలు తమ జ్ఞానాన్ని...శక్తి సామర్థ్యాలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు. ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా...జ్ఞానప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు.
 
తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు 'శ్రావణ పౌర్ణమి'. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య-విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అలాగే హయగ్రీవ స్వామికి బుధవారం పూట యాలకుల మాల సమర్పించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు