పూర్వీకులు మరణించిన నెల, తేదీ ఏంటో తెలుసుకుని ప్రతి సంవత్సరం అదే తేదీన తిథి ఇవ్వాలి. లేకుంటే కుటుంబంలో కష్టాలు, సమస్యలు చోటుచేసుకుంటాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. పితృపూజలు సక్రమంగా చేస్తే పితృదోషాల నుంచి బయటపడవచ్చు.
కొంతమందికి తమ పూర్వీకులు మరణించిన తేదీ తెలియకపోవచ్చు. వారు మహాలయ పక్షంలో, మహాలయ అమావాస్యల్లో శ్రాద్ధం ఇవ్వడం చేయవచ్చు. భాద్రపద కృష్ణ పక్ష పాడ్యమి నుంచి మహాలయ అమావాస్య వరకు ఉన్న 15 రోజులను పితృపక్షంగా పిలుస్తాం. ఈ 15 రోజులు పెద్దలకు ప్రీతిపాత్రమైనవి. ఈ పదిహేను రోజులపాటు పితృకార్యాలు నిర్వహిస్తారు కనుక ఎలాంటి శుభకార్యాలు చేయరు.
ఈ మహాలయ పక్షంలో పూర్వీకులు తమవారి వద్దకు తిరిగి వస్తారని విశ్వసిస్తారు. అందుకని వారిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రాద్ధకర్మలను ఆచరించాలి. వారికి ఇష్టమైన వంటలు చేసి వారిని స్మరించుకుంటూ ఆవులు, కుక్కలు, కాకులకు పెట్టండి. ఇది కాకుండా బ్రాహ్మణులకు, పేదలకు ఆహారం, వస్త్రాదులను ఇవ్వండి.