పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశంపై మరోసారి విషం చిమ్మారు. ఈ సమస్యను పరిష్కరించకుండానే భారత్ - పాక్‌ల మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడతాయని ఎవరైనా విశ్వసిస్తున్నారంటే.. వారు భ్రమలో జీవిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. లండన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు అవాకులు చవాకులు పేలారు. ప్రాంతీయంగా శాంతిని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నాలు చేయాలని పేర్కొనడం గమనార్హం.
'భారత్ - పాకిస్థాన్ పొరుగు దేశాలు. కలిసి ఉండటం నేర్చుకోవాలి. అయితే, కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించనంత వరకు సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోలేవు. కాశ్మీరీ ప్రజల త్యాగాలను వృథా కానివ్వం. భారత్ సహకారం అందించే బదులు.. పోరాట ధోరణిని అవలంభిస్తోంది. పహల్గాం ఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక అంతర్జాతీయ కమిటీని ఏర్పాటు చేయాలని కోరాం. శాంతియుతంగా జీవించాలా? లేదా పోరాటం కొనసాగించాలా అనేది మన చేతుల్లోనే ఉంది' అని షరీఫ్ నోరుపారేసుకున్నారు.
'భారత్‌తో నాలుగు యుద్ధాలు చేశాం. దీనికి బిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయి. ఆ నిధులను పాక్ ప్రజల అభివృద్ధికి ఉపయోగించాల్సింది' అని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. గాజాలో 65 వేల మందికిపైగా ప్రజలు ప్రాణత్యాగం చేశారన్నారు. ఇజ్రాయెల్ దురాగతాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేవరకు పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తే లేదని భారత్ పలు సందర్భాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.