ఈ నెలలో మూడే మూడు ముహూర్తాలు.. లక్షకుపైగా వివాహాలు..

మంగళవారం, 14 నవంబరు 2017 (11:42 IST)
ఈ నెలలో మూడే మూడు బ్రహ్మ ముహూర్తాలుండటంతో లక్షకుపైగా వివాహాలు జరుగనున్నాయి. దీంతో తెలంగాణకే పెళ్లి కళ వచ్చేసినట్లయింది. సాధారణంగా గోధూళి ముహూర్తాల్లో అంటే సాయంత్రం, రాత్రి వేళల్లో పెళ్లిళ్లు చేసేందుకు తెలంగాణ ప్రజానీకం పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, ఇప్పుడు వాటికి కూడా సై అంటున్నారు. ఫంక్షన్‌ హాళ్లు, పురోహితులు, వంటవాళ్లు, ఫొటో, వీడియోగ్రాఫర్లకు డిమాండ్‌ నేపథ్యంలో రాత్రి పెళ్లిళ్లకు కూడా సిద్ధమయ్యారు.
 
ఈ నెల తొమ్మిది నుంచి మౌఢ్యమి వెళ్ళిపోవడంతో ఈ నెల 22 నుంచి 29 వరకు వివాహ ముహూర్తాలున్నాయి. అయితే ప్రధానంగా 23, 24, 25 తేదీల్లోనే మంచి ముహూర్తాలు ఉండడం ద్వారా ఈ రోజుల్లోనే పెళ్లిళ్లు పెట్టేశారు. ఈ ముహూర్తాలు పోతేమళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో వేలాది మంది ఈ ముహూర్తాల్లోనే వివాహాలు జరిపించేందుకు సై అంటున్నారు. 
 
ఈ నెల 23, 24, 25 తేదీల్లో బ్రహ్మ ముహూర్తాలు ఉండడం, అనువైన తిథి, ఘడియలు ఆ రోజుల్లోనే ఉండడంతో వధూవరుల కుటుంబ సభ్యులు అదే ముహూర్తాలనే ఫిక్స్ చేస్తున్నారు. ఈ మూడు రోజుల్లోనే తెలంగాణలో దాదాపు 98 వేల వివాహాలు జరగనుండగా ఈనెల 29 వరకు మరో 10 వేల వరకు పెళ్లిళ్లు జరగగున్నాయి. అంటే, వారం రోజుల్లోనే దాదాపు లక్షా పది వేల వివాహాలు జరగనున్నాయి. 
 
పెళ్లిళ్లకు డిమాండ్ పెరగడంతో గతంలో రూ.2 లక్షలు ఉన్న ఆ ఫంక్షన్‌ హాల్‌ రేట్‌ను రూ.3 లక్షలకు పెంచేశారు. అన్నీ ఫంక్షన్ హాల్స్ ఇప్పటికే బుక్‌ అయిపోయాయి. పెళ్లి భోజనం రేట్లు కూడా పెరిగిపోయాయి. గతంలో అన్ని ఐటమ్స్‌తో పెట్టే భోజనం ప్లేట్‌ రూ.వెయ్యి వరకు ఉండగా ప్రస్తుతం రూ.1400 వరకు పెంచేశారు. పూల ధరలకూ రెక్కలొచ్చాయి. పురోహితులు సైతం రూ.20వేలు నుంచి లక్షకు తమ ఫీజును పెంచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు