ఏడు పరుశురామ క్షేత్రాల్లో అనంత పధ్మనాభ స్వామి ఆలయం కూడా ఒకటి. ప్రపంచంలో అత్యంత అధిక సంపద కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది తిరువనంతపురంలోని అనంత పధ్మనాభ స్వామి దేవాలయం. కేరళ రాష్ట్ర రాజధాని కేంద్రమైన తిరువనంతపురంలో ద్రవిడ శైలి నిర్మాణంలో ఈ ఆలయం నిర్మితమైంది. 8వ శాతాబ్ధానికి చెందిన దేవాలయంగా చరిత్ర చెబుతుంది. ఈ దేవాలయంలో విష్ణుమూర్తి పాము పడగప శయనిస్తున్న రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు.
80 అడుగుల ఎత్తులో ఉండే దేవాలయ ద్వజస్తంభం, బలిపీఠ మండపం, విశాలమైన కారిడార్ తోపాటు ఇక్కడ చెక్కబడ్డ శిల్పకళా సంపద చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. దేశ నలుమూల నుండే కాక విదేశాల నుండి ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు భక్తులు వస్తుంటారు. లెక్కలేనంత బంగారు సంపద కలిగిన స్వామిగా అనంత పధ్మనాభునికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఆలయంలోని నేలమాళిగల్లో లెక్కలేనంత సంపద భద్రంగా ఉంది. ఇప్పటి 5నేలమాళిగల్లో ఉన్న సంపదను బయటకు తీయగా, మరో గదికి నాగబంధం వేసి ఉండటంతో అందులోని సంపద ఎంత ఉందోనన్న సమాచారం ఎవ్వరికీ తెలియలేదు. తరతరాల నుండి వస్తున్న సంపదను ట్రావెన్ కోర్ సంస్ధానం పాలకులు సంరక్షకులుగా ఉంటూ సంరక్షిస్తున్నారు.
హిందువులు పవిత్రంగా భావించే శ్రీ మహావిష్ణువు కొలువైన తిరువనంత పురం అనంతపధ్మనాభుడిని దర్శించుకునేందుకు రోడ్డు, రైలు మార్గాలతోపాటు, విమాన సౌకర్యం కూడా ఉంది. ఈ దేవాలయంలోకి ప్రవేశించే వారు షర్టు ధరించకుండా ధోతితో స్వామి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. మహిళలు చీరా, జాకెట్, ఓణిలు ధరించి మాత్రమే ఆలయంలోకి ప్రవేశించేలా నిబంధనలు అమలు చేస్తున్నారు.