కార్తీకం హరిహరాదులకు ప్రీతికరం.. తులసీ, మారేడు దళాలతో..?!

గురువారం, 31 అక్టోబరు 2019 (15:36 IST)
శరదృతువులో కార్తీక మాసం రెండో మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీకమాసం అని పేరు వచ్చింది. కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను. నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమ రోజుల్లోనైనా తప్పక ఆచరించవలెనని పండితులు సూచిస్తున్నారు.
 
ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించాలి. అలాగే ఈ కార్తీకంలో శివుడిని మారేడుదళములతోనూ, జిల్లేడుపువ్వులతోనూ పూజించాలి. ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీకమాసం.
 
ఇంకా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకం.. అందులోనూ సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం. ప్రతి యేటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. 
 
హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్ధశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు విశేషంగా పూజలు చేస్తుంటారు. ఈ మాసంలో పలు ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు